వారం రోజుల పాటు తెలంగాణ లో రైతుబంధు సంబరాలు

ABN , First Publish Date - 2022-01-03T20:14:46+05:30 IST

తెలంగాణలో వినూత్నంగా, రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు.

వారం రోజుల పాటు తెలంగాణ లో రైతుబంధు సంబరాలు

వరంగల్: తెలంగాణలో వినూత్నంగా, రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరుతున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపధ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో మరింత ఉదృతంగా, వైభవంగా రైతు బంధు సంబరాలు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు.జనవరి 3వ తేదీ నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబరాలు స్థానికంగా అన్ని గ్రామాల్లో నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలు, పరిమితులకు లోబడి చేయాలని మంత్రి చెప్పారు. 


టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నేపథ్యంలో మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.చరిత్రలో ఎన్నడూ ఎవరూ ఆలోచించని విధంగా తెలంగాణ రైతుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించి తీసుకున్న గొప్ప నిర్ణయం రైతుబంధు కార్యక్రమని అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్న నేపథ్యంలో జనవరి మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతు బంధు సంబరాలు నిర్వహించాలని మంత్రి చెప్పారు.ఈసందర్బంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


సంక్రాంతి సందర్భంగా మహిళలను భాగస్వాములను చేస్తూ, ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల వద్ద జనవరి 10వ తేదీన ఘనంగా ముగింపు సంబరాలు చేయాలని అని మంత్రి చెప్పారు.ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం నుంచి చిన్న నీటి వనరులయిన చెరువుల మరమ్మత్తుల వరకు, రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికల వరకు సీఎం కెసిఆర్ చేపట్టిన ప్రతీ కార్యక్రమం ప్రస్తుత, భవిష్యత్ వ్యవసాయ రంగ, రైతాంగ అభివృద్ధికి, ఒక స్ఫూర్తి గా నిలపాలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-03T20:14:46+05:30 IST