రాష్ట్రంలో త్వరలో ఉచిత విద్య, వైద్యం

ABN , First Publish Date - 2022-02-16T06:28:44+05:30 IST

రాష్ట్రంలో త్వరలో ఉచిత విద్య, వైద్యం

రాష్ట్రంలో త్వరలో ఉచిత విద్య, వైద్యం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

 పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన

హనుమకొండ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉచిత విద్య, వైద్యం ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి రానున్నట్టు  రాష్ట్ర  పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు ఆయన  మంగళవారం ఉమ్మడి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు.  సీంఎ కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తొర్రూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. విశ్రాంతి భవనంలో అనాధలకు బట్టలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను, 35 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్‌్‌ చెక్కులను అందచేశారు. పెద్దవంగరలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో వృద్ధులు, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. పది మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్ళను అందచేశారు. అనాధలకు దుప్పట్లు, బట్టలను పంచారు. అనంతరం దేవరుప్పులలో అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. లంబాడీల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేవరుప్పులలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా   మంత్రి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు.  కేసీఆర్‌ తెలంగాణను దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిపారన్నారు. రాష్ట్రంలో ప్రతీ పౌరుడు బాగుపడ్డారని, ప్రతీ పల్లె అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో జనగామలో పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్‌ను ఆయన తెలంగాణ గాంధీగా అభివర్ణించారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకొని గ్రామ స్వరాజాన్ని కేసీఆర్‌ ఆచరణలో పెట్టారన్నారు. అందుకే కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని ఘనంగా  నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, దివ్యాంగులు, రోగులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేయాలని, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని, 27వ తేదీన మొక్కలు నాటి సర్వమత ప్రార్ధనలు చేయాలని పిలుపు నిచ్చారు.

Read more