Metro : ఔటర్‌ చుట్టూ మెట్రో!

ABN , First Publish Date - 2022-12-10T03:39:02+05:30 IST

హైదరాబాద్‌ నగరానికి ఎంత చేసినా తక్కువేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇక్కడికి బతకడానికి వచ్చేవారు, బతుకు బాగుంటుందని తెలిసి వచ్చే వారు భారీ సంఖ్యలో ఉంటారని చెప్పారు.

Metro : ఔటర్‌ చుట్టూ మెట్రో!

బీహెచ్‌ఈఎల్‌ నుంచీ ఎయిర్‌పోర్టు మార్గానికి కలిసేలా మెట్రో రైలు

కేంద్రం సహకరించకపోయినా

భగవంతుని దయతో నిర్మిస్తాం

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు

అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తాం

పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌

న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌లో కరెంట్‌

పోయినా మన నగరంలో పోదు!: కేసీఆర్‌

2వ దశ మెట్రో పనులకు శంకుస్థాపన

6250 కోట్లతో.. ఎయిర్‌పోర్టుకు మెట్రో

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరానికి ఎంత చేసినా తక్కువేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇక్కడికి బతకడానికి వచ్చేవారు, బతుకు బాగుంటుందని తెలిసి వచ్చే వారు భారీ సంఖ్యలో ఉంటారని చెప్పారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలనూ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చాలని, భవిష్యత్తును అంచనా వేసుకొని వసతులను కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో దశ మెట్రో రైలు పనులకు శుక్రవారం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రాయదుర్గం మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు రూ.6250 కోట్లతో 31 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు ఉదయం 11 గంటలకు శంకుస్థాపనచేసిన అనంతరం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో తెలంగాణ పోలీస్‌ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్‌ మహా నగరంలో ఆఫీసులు, ఆఫీసు స్పేస్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలు పెరుగుతున్నాయని చెప్పారు.

రియల్‌ ఎస్టేట్‌ పరుగులు పెడుతోందని, ఆకాశ హర్మ్యాలు వస్తున్నాయని సంతోషపడడం కాదని.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని తెలిపారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌డీ కూడా పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. అందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. గంటకు 100 కి.మీ. పైగా వేగంతో నడిచే మెట్రో రైలులో నగరం నుంచి 20-25 నిమిషాల్లోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చని.. ఇంతటి అద్భుత ప్రాజెక్టుకు తనతో శంకుస్థాపన చేయించినందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. సకల సౌకర్యాలతో హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని.. అందుకోసం రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడబోదని చెప్పారు. ప్రపంచంలో కాలుష్యరహితమైన ఏకైక మార్గం మెట్రో రవాణా వ్యవస్థ అని, ఇది హైదరాబాద్‌లో ఇంకా విస్తరించాల్సి ఉందని చెప్పారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో కలిసేలా ఉండాలని, ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ మెట్రో రావాల్సి ఉందని అన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజుల్లో భగవంతుని దయ వల్ల ఆ సౌకర్యం కూడా కల్పించుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు. ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలును వంద శాతం రాష్ట్రప్రభుత్వం, జీఎంఆర్‌, హెచ్‌ఎండీఏ నిధులతో చేపడుతున్నట్లు చెప్పారు.

కేటీఆర్‌ ఆధ్వర్యంలో విజయాలు సాధించాలి

‘‘మీరందరూ ప్రస్తుతం ఏ విధంగా ముందుకు వెళుతున్నారో.. ఇకపై కూడా అలాగే పనిచేయాలి. హైదరాబాద్‌ నగర శాసనసభ్యులు, మంత్రులు, రంగారెడ్డి, మేడ్చల్‌ ఎమ్మెల్యేలంతా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో మున్ముందు ఇంకా బాగా పనిచేయాలి. భవిష్యత్తులో అనేక విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌

24 గంటల్లో ఒక్క క్షణం కూడా హైదరాబాద్‌లో కరెంట్‌ పోదని కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌గా మార్చామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని విద్యుదుత్పత్తి కేంద్రాలు, రాష్ట్ర గ్రిడ్‌, జాతీయ గ్రిడ్‌తో హైదరాబాద్‌ నగరం అనుసంధానమైందని తెలిపారు. న్యూయార్క్‌, లండన్‌, పారి్‌సలో అయినా కరెంట్‌ పోవచ్చు కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంటు పోదని అన్నారు. 500 ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయని.. ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైవోవర్లు, అండర్‌పా్‌సలు నిర్మించి ట్రాఫిక్‌ కష్టాలు తీర్చుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 40 అంతస్తుల ఆకాశ హర్మ్యాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కూడా విపరీతంగా ట్రాఫిక్‌ పెరిగిందని, దానికి అనుగుణంగా రెండో రన్‌వే రానుందని తెలిపారు. రూ.6250 కోట్లతో ఎయిర్‌పోర్టుకు మెట్రోను వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నగరం చరిత్రలోనే కాదని, వర్తమానంలోనూ గొప్పదని తెలిపారు. 1912లోనే హైదరాబాద్‌కు కరెంట్‌ వస్తే.. 1927లో చెన్నైకి వచ్చిందని అన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల గతంలో చాలా రంగాల్లో బాధలు అనుభవించామని.. ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించామని తెలిపారు. ‘జై తెలంగాణ... జై భారత్‌’ అంటూ కేసీఆర్‌ ప్రసంగాన్ని ముగించారు. ఉద్యమంతో తెలంగాణను సాధించిన కేసీఆర్‌.. రెండు సార్లు సీఎంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాజాగా భారత రాష్ట్రసమితి అధ్యక్షుడిగా కేసీఆర్‌ వచ్చారని చెప్పారు. ఆయన చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలెన్నో చేపట్టారని కొనియాడారు.

10 గంటలకు అన్నారు.. కానీ..

శుక్రవారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని అధికారులు చెప్పినప్పటికీ.. దాదాపు గంటన్నర ఆలస్యంగా సీఎం కేసీఆర్‌ రాయదుర్గం చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు బహిరంగసభకు పెద్దగా జనం రాకపోవడంతో శంకుస్థాపన పనుల ప్రారంభంలో ఆలస్యం జరిగినట్లు ప్రచారం జరిగింది. మంత్రి కేటీఆర్‌ సుమారు 50 నిమిషాల పాటు సీఎం రాక కోసం ఎదురుచూశారు. బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ 12 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.

సీఎం ప్రసంగం మధ్యలో మహిళల నిరసన..

సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా నలుగురు ముస్లిం మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఒక్కసారిగా మీడియా విభాగంలోకి చొచ్చుకొచ్చిన వారు.. సీఎం కేసీఆర్‌కు కనిపించేలా ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 2017 సంవత్సరంలో నిర్వహించిన టీఆర్‌టీ ఉర్దూ మీడియం పోస్టులకు నియామకాలు చేపట్టాలని నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని నార్సింగ్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2022-12-10T03:39:03+05:30 IST