అదిగదిగో.. ఔషధ నగరి

ABN , First Publish Date - 2022-01-03T07:51:03+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఔషధ తయారీ సంస్థల సముదాయం.. వందల సంఖ్యలో కంపెనీలు ఒకే చోట ఔషధాలు తయారు చేసేలా ఏర్పాటు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులు..

అదిగదిగో.. ఔషధ నగరి

ప్రారంభానికి సిద్ధమవుతున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీ 

రంగారెడ్డి జిల్లాలో 19,333 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు

ఫార్మా యూనిట్లు, యూనివర్సిటీ, టౌన్‌షిప్‌, ఆర్‌అండ్‌డీ  

13,500 ఎకరాలు సిద్ధం.. శరవేగంగా రహదారుల నిర్మాణం 

ఈ నెలలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు 

నిమ్జ్‌ గుర్తింపుతో ఫార్మాసిటీపై విదేశీ దిగ్గజ కంపెనీల ఆసక్తి 

యూనిట్ల ఏర్పాటుకు స్థలం కోసం 400 కంపెనీల దరఖాస్తు

తొలి విడతలో 200 కంపెనీలకు స్థలాల కేటాయింపు!

20 ఏళ్లలో 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా

5.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం


హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం/యాచారం/కందుకూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఔషధ తయారీ సంస్థల సముదాయం.. వందల సంఖ్యలో కంపెనీలు ఒకే చోట ఔషధాలు తయారు చేసేలా ఏర్పాటు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులు, లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం. భారత ఫార్మా రంగానికే తలమానికంగా భావిస్తున్న హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాలు, పది గ్రామాల పరిధిలో మొత్తం 19,333 ఎకరాల్లో ముస్తాబవుతోంది. ప్రధాన, అంతర్గత రహదారుల పనులు దాదాపు పూర్తి కావడంతోఈ నెలలోనే ఫార్మాసిటీని ప్రారంభించి, తొలివిడతలో భాగంగా స్థాపనకు ముందుకొచ్చిన కంపెనీల్లో.. 200 కంపెనీలకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఔషధాల తయారీలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చుకోలేని చిన్న చిన్న ఫార్మా కంపెనీల కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాలను ఫార్మాసిటీలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పర్యావరణం ఏమాత్రం కలుషితం కాకుండా ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి ప్రత్యేకంగా కామన్‌ ఎఫ్లూయంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (సీఈటీపీ) వంటి అత్యాధునిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫార్మా కంపెనీలకు ఎండ్‌-టు-ఎండ్‌ సదుపాయాలను ఇక్కడ కల్పిస్తోంది. దీంతో బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, నోవార్టీస్‌ లాంటి ఫార్మా దిగ్గజ సంస్థలు తమ యూనిట్లను ఫార్మాసిటీలో నెలకొల్పేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. భారత్‌లో విస్తరణ చేపట్టాలనుకునే ప్రముఖ విదేశీ ఔషధ తయారీ సంస్థలు సైతం ఇందులో యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 


70 శాతం భూసేకరణ పూర్తి..

ఫార్మాసిటీ కోసం నిర్దేశిత భూసేకరణ విస్తీర్ణంలో 70 శాతం భూసేకరణ పూర్తయింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్‌, కందుకూరు మండలాల్లోని పది గ్రామాల పరిధిలో మొత్తం 19,333 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 9133 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మిగతా 10,200 ఎకరాలను స్థానిక రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా.. ఆదినుంచే ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఇందులో ఏర్పాట ుకానున్న ఫార్మా పరిశ్రమల్లో ఎక్కువగా కాలుష్యం వెదజల్లే రెడ్‌ కేటగిరీ యూనిట్లు ఉన్నాయని ప్రభుత్వమే తెలిపింది. దీంతో జల, వాయు కాలుష్యంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఎలాంటి కాలుష్యం లేకుండా కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అలాగే భూసేకరణలో నష్టపరిహారం విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది. దీంతోపాటు ఎకరం భూమి ఇచ్చినవారికి 120 గజాల ఇంటిస్థలాన్ని సిద్ధం చేసి ఇస్తామని, చదువుకున్న వారికి ఫార్మిసిటీలో ఏర్పాటయ్యే కంపెనీల్లో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇలా ఒక్కో సమస్యను అధిగమిస్తూ.. ఇప్పటివరకు మొత్తం 13,500 ఎకరాలు సేకరించింది. 


ఆరు క్లస్టర్లు.. నాలుగు కారిడార్లు 

ఫార్మాసిటీని మొత్తం ఆరు క్లస్టర్లుగా విభజించారు. ఇందులో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫార్మా యూనివర్సిటీ, పరిశోధన అభివృద్ధి కేంద్రం, ఫార్మాసిటీలో పనిచేసేవారికి నివాస సౌకర్యం కల్పించేందుకు టౌన్‌షిప్‌, ఫార్మా అనుబంధ సంస్థలు, పబ్లిక్‌ యుటిలిటీ ఉన్నాయి. మొత్తం ప్రాంతాన్ని అనుసంధానించేందుకు నాలుగు కారిడార్లను నిర్మిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5157 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా.. ఇది మరింత పెరగనుంది. ఫార్మాసిటీ నిర్మాణానికి రూ.3418 కోట్లను గ్రాంట్‌ రూపంలో ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరారు. ఇందులో రూ.1318 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధికి, రూ.2100 కోట్లు అంతర్గత మౌలిక వసతుల కల్పన, కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కానీ, కేంద్రం నుంచి నిధుల సాయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.750 కోట్ల రుణం తీసుకుని పనులు చేపడుతోంది. కనీసం రోడ్ల పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


వేగంగా సాగుతున్న పనులు.. 

ఇప్పటికే భూములు సేకరించిన యాచారం, కందుకూరు మండలాల పరిధిలో రహదారుల పనులు గత రెండు నెలలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. కందుకూరు మండల పరిధిలోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంట కొత్తూరు గేటు నుంచి బేగరికంచ గేటు వరకు ఆరు లేన్ల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. నానక్‌నగర్‌, మేడిపల్లి గ్రామాల నడుమ గుట్టల మధ్యలో నుంచి రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం నానక్‌నగర్‌ సమీపంలో ఉన్న భారీ గుట్టలను తొలగించి రోడ్డు వేస్తున్నారు. మరోవైపు మీర్‌ఖాన్‌పేట నుంచి నంది వనపర్తి మీదుగా యాచారం వరకు.. ఇటు ఫార్మాసిటిలోకి వెళ్లేందుకుగాను 120ఫీట్ల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన నిర్మాణ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాత్రివేళల్లోనూ పనులు జరుగుతున్నాయి. మీర్‌ఖాన్‌పేటలో వంద ఎకరాల్లో 420కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫార్మాసిటీని ఈ నెలలోనే ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 


400 కంపెనీల దరఖాస్తులు

భారత్‌ బయోటెక్‌, నోవార్టీస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో, అరబిందో, జీఈ, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థలు ఇప్పటికే జీనోమ్‌ వ్యాలీలో ఉన్నాయి. హైదరాబాద్‌ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్‌ హోదా ప్రకటించడం, కాలుష్య వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తుండడం, రోడ్డు రవాణాతోపాటు విమానాశ్రయం దగ్గర్లో ఉండటం వంటి అనుకూలతల నేపథ్యంలో ఇందులో పరిశ్రమల స్థాపనలకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉద్యోగులు నివాసం ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టౌన్‌షి్‌పను నిర్మించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పించనుంది. ఇందులో నెలకొల్పిన కంపెనీలకు పెట్టుబడివ్యయం 20ు తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ విశిష్టతల దృష్ట్యా పలు ఫార్మా సంస్థలు స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నాయి. వచ్చే20ఏళ్లలో ఫార్మాసిటీలోకి రూ.70వేల కోట్ల పెట్టుబడులు రాగలవని, 5.5లక్షల మందికి ఉపాధి లభించగలదని అంచనా వేస్తున్నారు. 


అంతర్జాతీయ గుర్తింపు దిశగా..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫార్మాసిటీ అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ ఫార్మా పరిశ్రమకు మరింతగా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే ఫార్మాస్యూటికల్స్‌, వ్యాక్సిన్ల తయారీకి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌.. బల్క్‌ డ్రగ్స్‌ తయారీలో కూడా కేంద్రం కాగలదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి దేశీయ ఔషధ పరిశ్రమ ఆదాయంలో మూడో వంతు తెలంగాణ నుంచే లభిస్తోంది. 300కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఫార్మా రంగం ఆదాయం 13 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.93,600 కోట్లు) ఉండగా.. మొత్తం దేశీయ పరిశ్రమ ఆదాయం 42 బిలియన్‌ డాలర్లు ఉంది. 2030 నాటికి దేశీయ పరిశ్రమ ఆదాయం 120 బిలియన్‌ డాలర్లకు, తెలంగాణ పరిశ్రమ ఆదాయం 35బిలియన్‌ డాలర్లకు చేరగలదని అంచనా. ఆ దిశగా హైదరాబాద్‌ ఫార్మా పరిశ్రమ అడుగులు వేయడానికి హైదరాబాద్‌ ఫార్మా సిటీ కీలకం కానుంది. హైదరాబాద్‌కు చెందిన ఔషధ కంపెనీలు ఇప్పటికే జనరిక్‌ ఔషధాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసి తక్కువ ధరలకు అందిస్తున్నాయి. నియంత్రణలు అధికంగా ఉండే అమెరికా, యూరప్‌ మార్కెట్లలో సైతం హైదరాబాద్‌ కంపెనీలు పట్టు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఫార్మా సిటీలో అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫార్మా సిటీ ఔషధ ఎగుమతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందంటున్నారు. 


నిమ్జ్‌గా గుర్తిస్తే..

ప్రాజెక్టు ప్రాంతానికి అవసరమయ్యే రవాణా (విమానాశ్రయం, నౌకాశ్రయం, రైల్వే, జాతీయరహదారులు), మౌలిక వసతులను పబ్లిక్‌ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 

మొత్తం ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా 20 శాతం వరకు వయబిలిటి గ్యాప్‌ ఫండింగ్‌ సమకూరుస్తుంది. 

ప్రాజెక్టు అభివృద్ధికి వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది.

మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు పొందేందుకు సహకరిస్తుంది.

ప్రాజెక్టుకు కావాల్సిన కేంద్రపర్యావరణ అనుమతులు, ఉపాధి కల్పనకు కార్మిక చట్టాలను సరళీకరిస్తుంది.

పార్మాసిటీలోని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ‘జాబ్‌ లాస్‌ పాలసీ’ని అమలు చేస్తుంది. దీని ప్రకారం.. నష్టాలు, ఇతర సమస్యలతో కంపెనీ మూసివేతకు గురైతే.. అందులోని ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తారు. 

నిమ్జ్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు వ్యాపార విస్తరణచేస్తే.. అందుకు అయ్యే యంత్రాలు, ఇతర పెట్టుబడులపై పన్ను రాయితీలు కల్పిస్తారు. 

కంపెనీలు పర్యావరణ అనుకూల యంత్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ‘టెక్నాలజీ ఆక్వెజిషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌’ను నిర్వహిస్తుంది. ఈ నిధులతో వ్యర్థాల నిర్వహణ, ఎన్విరాన్‌మెంట్‌ ఆడిట్‌, వాటర్‌ ఆడిట్‌ నిర్వహిస్తారు.  

ఇందులోని కంపెనీల ఉత్పాదకత పెంపుతోపాటు ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధికి కేంద్రప్రభుత్వ రంగసంస్థలు సహకారం అందిస్తాయి. అలాగే ఇక్కడి ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాల పెంపును పర్యవేక్షించడంతో పాటు అభివృద్ధికి చేయూతనిస్తాయి.

జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌సడీసీ) ద్వారా ఇందులోని సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. 

ఇక్కడి కంపెనీలకు అవసరమయ్యే మానవ వనరుల కోసం ప్రాజెక్టులో ఐటీఐ, ప్రత్యేక పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేస్తే కావాల్సిన ఆర్థిక సహకారం అందిస్తారు. 

ప్రాజెక్టులో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపడతారు. 

Read more