వైద్య విద్య.. బోధన మిథ్య!

ABN , First Publish Date - 2022-02-21T08:07:54+05:30 IST

రాష్ట్రంలో వైద్య విద్యకు మహర్దశ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త వైద్య కళాశాలలంటూ హడావుడి చేస్తోంది. కానీ, ఇప్పటికే ఉన్నవాటిలో అధ్యాపకులే లేరు. మరోవైపు వైద్య విద్య ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ మొదలైంది.

వైద్య విద్య.. బోధన మిథ్య!

అధ్యాపకుల్లేని వైద్య విద్య కళాశాలలు

1,300 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ

ప్రొఫెసర్‌, అసోసియేట్‌లతో కలిపి 1,600

తొమ్మిది మెడికల్‌ కాలేజీల్లోనూ పరిస్థితి ఇదే..

పీహెచ్‌సీల సూపర్‌ స్పెషలిస్టులు సరెండర్‌

డీహెచ్‌, టీవీవీపీలోని స్పెషలిస్టులపై దృష్టి

ఉన్నవాటిలో ఇలాగైతే.. కొత్తవాటిలో ఎలా?

మార్చిలో ఎంబీబీఎస్‌ తరగతుల ప్రారంభం

హడావుడిగా 645 పోస్టుల భర్తీకి అనుమతి

ఇవన్నీ కూడా ‘తాత్కాలిక’ నియామకాలే!


హైదరాబాద్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్యకు మహర్దశ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త వైద్య కళాశాలలంటూ హడావుడి చేస్తోంది. కానీ, ఇప్పటికే ఉన్నవాటిలో అధ్యాపకులే లేరు. మరోవైపు వైద్య విద్య ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ మొదలైంది. వచ్చే నెలలో తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో 9 ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలున్నాయి. అన్నింటా ప్రొఫెసర్ల కొరత నెలకొంది. మరీ ముఖ్యంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కొరత భారీగా ఉంది. ప్రస్తుతం 1,300 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రొఫెసర్‌తో పాటు అసోసియేట్‌ ప్రొఫెసర్‌  కూడా కలిపి 300 పోస్టులు ఖాళీ ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ట్యూటర్‌, ఇతర పాలనాపరమైన ఖాళీలు దాదాపు 300 ఉంటాయి. అంతా కలిపితే 1,900 దాటుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయల్లోనే 400 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కొరత ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, రిమ్స్‌ ఆదిలాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్‌ వైద్య విద్య కళాశాలల్లో ఖాళీలున్నాయి. అధ్యాపక పోస్టులే 1,600 వరకు ఖాళీగా ఉండడంతో ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)లోని స్పెషలిస్టు వైద్యులను బలవంతంగా వైద్య విద్య విభాగంలోకి తీసుకుంటున్నారు. ఇక ఇటీవల పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సూపర్‌ స్పెషలిస్టు వైద్యులందరినీ వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు సరెండర్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. వీరిని వైద్య విద్య కళాశాలల్లో అధ్యాపకులుగా నియమించనున్నారు.


ఏడాది కాంట్రాక్టు.. ఎప్పుడైనా తొలగింపు

ఖాళీల భర్తీకి అనుమతివ్వాలని డీఎంఈరమేశ్‌రెడ్డి పంపిన ప్రతిపాదనలపై సర్కారు ఆలస్యంగా స్పందించింది. నాలుగు రోజుల క్రితం 645 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులిచ్చింది. అదికూడా ఏడాది కోసం కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే. ఎంబీబీఎస్‌ తరగతులు వచ్చే నెలలో మొదలవుతాయనగా, హడావుడిగా అఽధ్యాపకుల భర్తీకి అనుమతివ్వడం గమనార్హం. మరోవైపు ఏడాదిలోగా శాశ్వత నియామకాలు ఎప్పుడు చేపట్టినా వెంటనే వీరిని తొలగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ అంచనా ప్రకారం 645 మంది విధుల్లో చేరినా.. ఇంకా 655 పోస్టులు ఖాళీగానే ఉంటాయి. వాస్తవానికి ఏడాదిలోపు కాంట్రాక్టు ఉద్యోగాల కోసం స్పెషాలిటీ వైద్యులెవరూ రారు. 


వైద్య విద్యపై తీవ్ర ప్రభావం

అసలే కొవిడ్‌ కాలం. ఆపై అధ్యాపకుల కొరతతో రెండేళ్లుగా చదువులు అరకొరగా సాగుతున్నాయి. కొత్తగా చేరినవారికైనా నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి వస్తుందా? అంటే అనుమానమే. తరగతులు ప్రారంభమయ్యేందుకు నెల రోజులుండగా.. ఆలోగా రెండు వేలమంది అధ్యాపకులను సర్కారు నియమిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాత్కాలిక పద్ధతిలో 645 మందిని, పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న 291 మంది వైద్యులను తీసుకున్నా వెయ్యిదాకా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ ప్రభావం చదువులపై పడుతోంది. అలాగే వైద్య విద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేవారు తక్కువగా ఉంటారు. దాంతో ఉన్నవారిపై తీవ్ర పనిభారం పడుతుంది. బోధనాస్పత్రుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులే ఓపీ, నైట్‌ డ్యూటీ చేస్తారు. ఒక్కో పీజీ ఏకధాటిగా 48 గంటలు పని చేస్తారు. సీనియర్‌ అధ్యాపకులు పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు లేకుంటే ఆ భారమంతా పీజీలపైనే పడుతుంది. సందర్భాన్ని బట్టి కొన్నిచోట్ల పీజీలతోనే తరగతులను నడిపిస్తున్నారు.


రెగ్యులర్‌ కంటే తాత్కాలికంలోనే జీతాలెక్కువా?

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారే(2017లో 190 మంది) రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించారు. మళ్లీ శాశ్వత నియామకాల్లేవు. వాస్తవానికి గతంలో ఉన్న జీవో 154 ప్రకారం ఏటా వైద్య విద్యలో శాశ్వత నియామకాలు చేపట్టాలి. దానికి సర్కారు తూట్లు పొడిచింది. రెగ్యులర్‌ అసిస్టెంట్‌ అధ్యాపకులకు రూ.65 వేల వేతనం ఇస్తోంది. కాంట్రాక్టుపై తీసుకునేవారికి రూ.1.25 లక్షల వేతనం చెల్లిస్తామంటోంది. వీరికి రూ.50 వేలు భత్యం ఇస్తామని జీవో జారీచేసింది. దీనిపై శాశ్వత అధ్యాపకులు మండిపడుతున్నారు.


శాశ్వత నియామకాలు చేపట్టాలి

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఏటా భర్తీ చేయాలి. నిమ్స్‌, ఎయిమ్స్‌ తరహాలో వేతనాలివ్వాలి. అప్పుడే చేరేందుకు ఆసక్తి చూపుతారు. ప్రభుత్వం ప్రతిసారి తాత్కాలిక నియామకాలు చేపట్టడం సరికాదు. చాలామంది నిరుద్యోగ వైద్యులున్నారు. వారంతా ఎదురుచూస్తున్నారు. ఇక రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంచి వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి.

-డాక్టర్‌ గుండగాని శ్రీనివాస్‌, జూడాల సంఘం సలహాదారు


అధ్యాపకులు లేకుంటే తీవ్ర ప్రభావం

ట్యూటర్‌ పోస్టులు కూడా ఖాళీ పెడుతున్నారు. డైరెక్టు రిక్రూట్‌ లేదు. అసిస్టెంట్‌, ట్యూటర్‌ పోస్టులన్నింటిని భర్తీ చేయాలి. అది కూడా జీవో 154 ప్రకారం చేయాలి. తగినంతమంది అధ్యాపకులు లేకుండా బోధన సాగిస్తే వైద్య విద్యపై తీవ్రప్రభావం చూపుతుంది. కేవలం భవనాలు కడితే సరిపోదు. ఉన్నవారిని సర్దుబాటు పేరుతో ఇబ్బంది పెడుతున్నారు

-డాక్టర్‌ మహేశ్‌, అధ్యక్షుడు, హెల్త్‌కేర్‌ రీఫార్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌

Read more