రాజన్న పాలన తేవడానికే పాదయాత్ర

ABN , First Publish Date - 2022-10-02T05:45:42+05:30 IST

కేసీఆర్‌ పాలన ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు తెలంగాణగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం చింతకుంట నుంచి చిల్‌పచెడ్‌ మండలం చిట్కుల్‌ పరిధిలో మెదక్‌ జిల్లాలో ప్రవేశించింది.

రాజన్న పాలన తేవడానికే పాదయాత్ర
చిట్కుల్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ షర్మిల

తెలంగాణాలో రైతులకు భరోసా లేదు

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకే  బంగారు తెలంగాణ : వైఎస్‌ షర్మిల


చిల్‌పచెడ్‌, అక్టోబరు 1: కేసీఆర్‌ పాలన ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు తెలంగాణగా మారిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం చింతకుంట నుంచి చిల్‌పచెడ్‌ మండలం చిట్కుల్‌ పరిధిలో మెదక్‌ జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె దారిపొడువునా ఆమె ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చిట్కుల్‌లో వీఆర్‌ఏలు తమ బాధలను తెలుపుతూ ఆమెకు  వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో రైతులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ. 30 వేల వరకు లబ్ధి చేకూరేదని, కానీ ఇప్పుడు మాత్రం రూ. 5వేలతోనే సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన రాష్ట్రంలో సాగుతున్నదని వాపోయారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణాలు మాఫీ చేయకపోవడంతో కేసీఆర్‌ ఇస్తున్న రైతుబంధు వడ్డీలకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు భరోసా లేదని, నిరుద్యోగం పెరిగిపోతున్నదని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగంరాక హమాలీ పని చేసుకుంటున్నారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాజన్న పాలనలో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 20 నిమిషాల్లో 108 వాహనం వచ్చేదని, ప్రస్తుతం 108 వాహనాలకే సుస్తీ చేసిందని పేర్కొన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఎంతమందికి ఇచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంచోడు.. మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకుపోయిండు అన్నట్టు కేసీఆర్‌ పాలన తయారైందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, తమకు అధికారం ఇస్తే వైఎస్సార్‌ పాలన తెస్తానని హామీ ఇచ్చారు.


వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ

కొల్చారం, అక్టోబరు 1: కొల్చారం మండల పరిధిలోని ఘనపూర్‌లో వైఎస్సార్‌ విగ్రహాన్ని వైఎస్‌ షర్మిల ఆవిష్కరించారు. దుంపలకుంట వద్ద ఆమె పాదయాత్ర మండలంలో ప్రవేశించింది. రంగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు పాలన సాగుతున్నదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని.. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. 

Updated Date - 2022-10-02T05:45:42+05:30 IST