రైతు గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-30T04:48:28+05:30 IST

రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టడం లేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో గురువారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

రైతు గోడు పట్టని రాష్ట్ర ప్రభుత్వం
హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల

రుణమాఫీ చేయక డిఫాల్టర్లుగా రైతులు

రూ. 5వేల రైతుబంధుతో ఒరిగేదేమీ లేదు

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల


హత్నూర, సెప్టెంబరు 29: రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టడం లేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. హత్నూర మండలం  దౌల్తాబాద్‌లో గురువారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు, ఏకకాలంలో రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారని వాపోయారు. రూ. 5వేల రైతుబంధుతో రైతు రాజు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ముక్కిపోయిన బియ్యంతో విద్యార్థులకు అన్నం వండిపెట్టడం సిగ్గుచేటని అన్నారు. నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా ప్రభుత్వం చలించకపోవడం విచారకరమని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తినే అన్నం ముఖ్యమంత్రి మనవడు తినే అన్నంలా ఉంటుందని చెప్పిన కేసీఆర్‌కు విద్యార్థుల గోడు పట్టడం లేదా అని నిలదీశారు. అనంతరం మండల పరిధిలోని దౌల్తాబాద్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించిన షర్మిల జై భీమ్‌ అంటూ నినాదాలు చేశారు. బస్టాండ్‌ ఆవరణలో ఓ వృద్ధుడు షర్మిలను పూలమాలతో సత్కరించగా, ఓ యువతి కొబ్బరి బొండం ఇచ్చి అభిమానం చాటుకుంది. కొన్యాలలో కూరగాయల వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా నర్సాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దౌల్తాబాద్‌లో వైఎస్సార్‌టీపీ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చించివేశారు. షర్మిల యాత్రను అడ్డుకునే అవకాశం ఉందని తెలుసుకున్న పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-09-30T04:48:28+05:30 IST