పేరుకే ఎమ్మెల్యే.. పెత్తనమంతా భర్తదే

ABN , First Publish Date - 2022-10-03T05:42:11+05:30 IST

మెదక్‌లో ఎమ్మెల్యే భర్త పెత్తనమే నడుస్తున్నదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

పేరుకే ఎమ్మెల్యే.. పెత్తనమంతా భర్తదే
మెదక్‌ పట్టణంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల

కమీషన్‌ ఇవ్వకుంటే బిల్లులు రావు

నియోజకవర్గానికి పద్మా దేవేందర్‌రెడ్డి ఏం చేశారు?

వైఎస్సార్‌ కృషితోనే రైలు వచ్చింది

హామీల అమలులో కేసీఆర్‌ విఫలం : వైఎస్‌ షర్మిల


మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 2: మెదక్‌లో ఎమ్మెల్యే భర్త పెత్తనమే నడుస్తున్నదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం మెదక్‌ పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పద్మాదేవేందర్‌రెడ్డిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి ఏంచేశారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఏ పనికైనా ఎమ్మెల్యే భర్తకు కమిషన్‌ ఇచ్చుకోవాల్సిందేనని.. లేకపోతే పని సాగదని ఆరోపించారు. కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్‌ చేతులెత్తేయడంతో కలెక్టరేట్‌ పనులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు. కొనాపూర్‌ సొసైటీ చైర్మన్‌ అయిన దేవేందర్‌రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణం చేశారని డైరెక్టర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తున్నదని ఆరోపించారు. జర్నలిస్టులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యమ ద్రోహులంటూ నిందలు వేయడం టీఆర్‌ఎస్‌ నాయకులకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. వైఎస్‌ పాలనలో మహిళను హోంమంత్రిని చేస్తే.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన ఐదారేళ్ల వరకు మహిళకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.  మెదక్‌ ఎమ్మెల్యే మంత్రి కావాలని ఆశపడినా చివరకు నిరాశే మిగిలిందని ఎద్దేవా చేశారు. మెదక్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, బైపాస్‌ రోడ్డు హామీలు అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌ కృషితోనే మెదక్‌కు రైలు వచ్చిందని అన్నారు. వైఎస్‌ హయంలో ఘనపూర్‌ ఆనకట్టకు రూ.40 కోట్లు మంజూరు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చేలా కృషి చేశారన్నారు. కేసీఆర్‌ కనీసం ఒక్క ఎకరాకైన నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో వైఎస్‌ మెదక్‌లో పర్యటించి నీటి సమస్య తీర్చడానికి 10 వాటర్‌ట్యాంక్‌లు కట్టించారని గుర్తుచేశారు. పట్టణానికి మహిళా డిగ్రీ కళాశాల, ఐటీఐ మంజూరు చేశారని, రూ. 250 కోట్లతో రోడ్లు మరమ్మతు చేయించారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రామాయంపేటలోనే ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి చెరుకు రైతులను నిండా ముంచారని విమర్శించారు. వైఎస్సార్‌ హయాంలో నిజాం షుగర్స్‌ను తెరిపించేందుకు కమిటీ వేశారని, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌ను తిరిగి తెరిపిస్తామని, వైఎస్‌ చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

Read more