రాష్ట్రాన్ని ఉద్దరించని కేసీఆర్‌ దేశానికేం చేస్తాడు?

ABN , First Publish Date - 2022-10-05T04:51:32+05:30 IST

రాష్ట్రాన్ని ఉద్దరించని సీఎం కేసీఆర్‌ దేశానికేం చేస్తాడని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

రాష్ట్రాన్ని ఉద్దరించని కేసీఆర్‌ దేశానికేం చేస్తాడు?
చేగుంటలో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే క్రాంతి సిద్ధమా?

బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్త దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల    


చిన్నశంకరంపేట/చేగుంట, అక్టోబరు 4: రాష్ట్రాన్ని ఉద్దరించని సీఎం కేసీఆర్‌ దేశానికేం చేస్తాడని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం చిన్నశంకరంపేట మండలం రుద్రారం, చందంపేట గ్రామాల మీదుగా చేగుంట మండలంలో ప్రవేశించింది. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశాన్ని ఏలుతానని ఫాంహౌ్‌సలో పడుకొని పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకుని సొంత విమానం కొనుగోలు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారం కోసం తండ్రి కొడుకులు ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని వాపోయారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. శిథిలమైన రోడ్లకు మరమ్మతులు కూడా చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం చేగుంటలో రోడ్‌షో, బహిరంగ సభలో మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ నాయకుడని విమర్శించారు. తనను గెలిపిస్తే దుబ్బాకలో ఆసుపత్రి కట్టిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తరువాత హైదరాబాదులో కార్పొరేట్‌ హాస్పిటల్‌ కట్టుకున్నారని ఆరోపించారు. వారి ఆస్పత్రిని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారంటే టీఆర్‌ఎ్‌సతో ఆయన సంబంధాలను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజల చెవిలో కేసీఆర్‌ మామూలు పువ్వు పెడితే.. రఘునందన్‌రావు క్యాలీఫ్లవర్‌ పెట్టాడని విమర్శించారు. మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు రెండింతల నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ కేసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతికిరణ్‌ సోదరులు, అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయంపై ప్రశ్నించినందుకే తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. దళిత ఎమ్మెల్యే అయిన క్రాంతికిరణ్‌ దళితుల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషిచేయలేదని విమర్శించారు. దళితులపై దాడులు జరుగుతున్నా స్పందించ లేదని స్పష్టం చేశారు. దళిత ఉపముఖ్యమంత్రిని అవమానించి పదవిలోంచి తొలగిస్తే స్పందించనివారు తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీవారు పోలీస్‌ వ్యవస్థను చెప్పుచేతుల్లో పెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు దమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. కార్యక్రమాల్లో వైఎస్సార్‌టీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

Read more