మైదానాల్లో కుస్తీ

ABN , First Publish Date - 2022-11-30T00:07:12+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమాజంలో పోలీసు ఉద్యోగానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. అందుకే ఖాకీ డ్రెస్సు వేసుకోవాలనే కలను సాకారం చేసుకోవాలని యువతీయువకులు ఆరాటపడుతుంటారు.

మైదానాల్లో కుస్తీ
సిద్దిపేటలోని మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్న పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులు

‘పోలీస్‌’ ఉద్యోగ ఫిజికల్‌ ఈవెంట్స్‌కు అభ్యర్థులు సన్నద్ధం

తొలిసారిగా సిద్దిపేటలో శారీరక సామర్థ్య పరీక్షలు

డిసెంబరు 8 నుంచి ప్రారంభం

ఈవెంట్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 29: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమాజంలో పోలీసు ఉద్యోగానికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. అందుకే ఖాకీ డ్రెస్సు వేసుకోవాలనే కలను సాకారం చేసుకోవాలని యువతీయువకులు ఆరాటపడుతుంటారు. అయితే సంక్పలబలంతోపాటు శారీరక శ్రమ, విషయ పరిజ్ఞానం ఉంటే పోలీస్‌ కొలువు కొట్టడం సులభమేనని ఇప్పటిదాకా ఎంతోమంది నిరూపించారు. ప్రస్తుతం పెద్దసంఖ్యలో ఖాళీల భర్తీ కోసం టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ ద్వారా పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల కావడంతోపాటు ఇటీవల ప్రిలిమినరీ రాత పరీక్ష ముగిసింది. ఇందులో అర్హత సాధించిన వారిని శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపిక చేశారు. డిసెంబరు 8 నుంచి ఈ పరీక్షలు జరగనున్న క్రమంలో ఆశావహులంతా మైదానాల్లోనే కుస్తీ పడుతున్నారు.

సిద్దిపేటలో తొలిసారిగా

2016 అక్టోబరులో సిద్దిపేటకు జిల్లా కేంద్ర హోదాతోపాటు పోలీస్‌ కమిషనరేట్‌ హోదా దక్కింది. అప్పటి నుంచి పోలీసుల కార్యకలాపాలు పెరిగాయి. సిద్దిపేట పట్టణ శివారు, దుద్దెడ శివారులో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని పెద్దఎత్తున నిర్మించారు. ఈ కార్యాలయం ముందే భారీ స్థాయిలో పరేడ్‌ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటైనప్పటికీ రెండు మార్లు సంగారెడ్డిలోనే ఈ జిల్లాకు చెందిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు. సిద్దిపేట నుంచి ఒకరోజు ముందుగా సంగారెడ్డికి వెళ్లి అక్కడ నిర్వహించే ఫిజికల్‌ ఈవెంట్స్‌లో పాల్గొనే పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో నిద్రతోపాటు సరైన ఆహారం, వసతి లేక శారీరక సామర్థ్య పరీక్షల అర్హతను తృటిలో కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావుకు పలువురు తమ గోడు వెళ్లబోసుకోగా ఈసారి పట్టుబట్టి సిద్దిపేటలోని పరేడ్‌ గ్రౌండ్‌లో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేలా కృషి చేశారు. దీంతో సుమారు 10 వేల మందికి ఉపశమనం లభించినట్లయ్యింది.

మైదానాల్లో కసరత్తు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో జిల్లాకు సంబంధించి సుమారు 5వేల మంది అభ్యర్థుల వరకు అర్హత సాధించినట్లు అంచనా. వీరంతా కూడా సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లోని మైదానాల్లో కసరత్తు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మూడు మైదానాలు ఉదయం, సాయంత్రం పోలీసు అభ్యర్థులతో నిండిపోతున్నాయి. రన్నింగ్‌, షాట్‌పూట్‌, లాంగ్‌ జంప్‌ విభాగాల్లో అర్హత సాధించడానికి తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువత ఇక్కడే హాస్టళ్లలో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నారు.

ఫిజికల్‌ టెస్టు విధానంలో మార్పులు

సిద్దిపేట అగ్రికల్చర్‌, నవంబరు 29 : ఈసారి ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌లో కొన్నిమార్పులు చేశారు. గతంలో ఐదు అంశాల్లో జరిగే ఈ పరీక్షా విధానం మూడు అంశాలకే పరిమితం చేశారు. పురుషులకు 1,600 మీటర్ల పరుగుపందాన్ని 7.15నిమిషాల్లో, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌కు 9.30నిమిషాలు కేటాయించారు. మహిళలు 800మీటర్ల పరుగు పందాన్ని 5.20నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయం కంటే అనగా.. పురుషులు 4 నిమిషాల 15 సెకండ్లలో కొడితే 100 మార్కులు, మహిళలకు 3 నిమిషాల ఐదు సెకండ్లలో కొడితే 100మార్కులు పొందుతారు. తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసిన అభ్యర్థులకు మెరిట్‌ మార్కులు కూడా ఇవ్వనున్నారు. లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌లలో కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. లాంగ్‌జం్‌పలో పురుషులు 4మీటర్లు, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ 3.50మీటర్లు, మహిళలు 2.50మీటర్ల దూరం జంప్‌ చేయాల్సి ఉంటుంది. 7.2కిలోల బరువు గల షార్ట్‌పుట్‌ను పురుషులు 6మీటర్లు, 4కిలోల బరువు గల షార్ట్‌పుట్‌ను మహిళలు 4మీటర్లు విసిరితే క్వాలిఫై అవుతారు. సివిల్‌, ఏఆర్‌ విభాగాల అభ్యర్థులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఉద్యోగానికి ఈ మూడు తప్పనిసరి కావడంతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఉద్యోగానికి ఈ మూడు తప్పనిసరి కావడంతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

అభ్యర్థులకు అండగా

సిద్దిపేటక్రైం, నవంబరు 29: ఈ ఏడాది ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ఉచిత కోచింగ్‌ సెంటర్‌లో జిల్లా మొత్తం మీద 1,050మంది శిక్షణ పొందారు. 532మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కానిస్టేబుల్‌కు 333 మంది, ఎస్‌ఐకి 199 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో పురుషులు 342, స్త్రీలు 190 మంది ఉన్నారు. వీరికి సిద్దిపేటతో పాటు గజ్వేల్‌, చేర్యాల, దుబ్బాకలో దేహదారుఢ్య శిక్షణ ప్రారంభించారు. సిద్దిపేటలోని మల్టీపర్పస్‌ హైస్కూల్‌ మైదానంలో మహిళా అభ్యర్థులకు, ఎల్లంకి కాలేజీ మైదానంలో పురుషులకు ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఈవెంట్స్‌ కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్‌ తన సొంత ఖర్చులతో వారి శరీర దృఢత్వం కోసం ఉదయం పూట పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు అందజేస్తున్నారు. సిద్దిపేటలో ఉచిత కోచింగ్‌ క్యాంపును పలుమార్లు మంత్రి ఆకస్మికంగా సందర్శించి శిక్షణను పరిశీలించారు.

మూడు విషయాలను తప్పకుండా ఆచరించాలి

- శ్వేత, పోలీస్‌ కమిషనర్‌, సిద్దిపేట

శారీరక సామర్థ్య పరీక్షలకు సమయం ఆసన్నమైంది. అందుకే మూడు విషయాలు తప్పనిసరిగా ఆచరించాలి. మైదానంలో బాగా ప్రాక్టీస్‌ చేయాలి. శారీరక ధృడత్వం కోసం ప్రొటీన్‌ను అందించే మంచి ఆహారం తీసుకోవాలి. 8గంటల పాటు నిద్ర ఉండాలి. ఇవి పాటిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. భయాన్ని వదిలేస్తేనే ఉద్యోగం మీ సొంతమవుతుంది.

లాంగ్‌జం్‌పపై దృష్టి పెట్టాలి

- ఉప్పలయ్య, సీనియర్‌ కోచ్‌

శారీరక సామర్థ్య పరీక్షల్లో ఈసారి ఆప్షన్లు లేకుండా అన్నింట్లోనూ అర్హత సాధించాలి. లాంగ్‌జం్‌పపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చదునైనా మైదానాల్లో రన్నింగ్‌ రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ ఉండాలి. హార్డ్‌ ట్రైనింగ్‌ చేయకుండా శరీరాన్ని గాయాలబారిన పడకుండా చూసుకోవాలి. మంచి ప్రొటీన్‌ ఆహారం, పండ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, రాగిజావా తీసుకోవాలి.

Updated Date - 2022-11-30T00:07:12+05:30 IST

Read more