ఎందుకో ఈ రోడ్లు!

ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన వంద ఫీట్ల రోడ్ల నిర్మాణాలు విమర్శలకు తావిస్తున్నాయి. బిల్డర్లకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ రోడ్లను నిర్మిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు భూములను కలుపుతూ రోడ్లను నిర్మిస్తుండగా.. ఈ రోడ్లను చూపించి బిల్డర్లు ఆకాశహార్మ్యాల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందుతున్నారు.

ఎందుకో ఈ రోడ్లు!
రేడియల్‌ రోడ్డు 30 ఎక్స్‌టెన్షన్‌కు ఆనుకుని ప్రైవేటు భూమిని కలిపేలా నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డు

బిల్డర్ల కోసం ప్రభుత్వ భూమిలో రహదారులు

ఐటీ పార్కుల నిర్మాణం కోసం అసైన్డ్‌ భూముల సేకరణ

ఏ వసతులు కల్పించకపోయినా ఎడాపెడా రోడ్ల నిర్మాణం

పక్కనున్న ప్రైవేటు స్థలాల కోసమేనని విమర్శలు

డంపింగ్‌ యార్డుకు స్థలం లేక స్థానికులకు ఇబ్బందులు


రామచంద్రాపురం, సెప్టెంబరు 8 : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన వంద ఫీట్ల రోడ్ల నిర్మాణాలు విమర్శలకు తావిస్తున్నాయి. బిల్డర్లకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ రోడ్లను నిర్మిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేటు భూములను కలుపుతూ రోడ్లను నిర్మిస్తుండగా.. ఈ రోడ్లను చూపించి బిల్డర్లు ఆకాశహార్మ్యాల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందుతున్నారు. 


రోడ్డు పక్కనే రోడ్డు!

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో సర్వే నంబరు30లో ఐటీ పార్కుల నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి అసైన్డ్‌ భూమిని సేకరించి టీఎ్‌సఐఐసీ సంస్థకు అప్పగించింది. ఈ స్థలంలో  టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో రేడియల్‌ రోడ్డు 30 ఎక్స్‌టెన్షన్‌ను కలుపుతూ పక్కనే 400 మీటర్ల పొడవున వంద ఫీట్ల రోడ్డును టీఎ్‌సఐఐసీ నిర్మిస్తున్నది. రేడియల్‌ రోడ్డు నుంచి వై ఆకారంలో రోడ్డును కొనసాగించి కొంతదూరం వెళ్లగానే రోడ్డును కుడివైపుకు మళ్లించి మళ్లీ రేడియల్‌ రోడ్డును కలుపుతున్నారు. ఈ రోడ్ల మధ్యలో త్రిభుజాకారంలో ప్రభుత్వ స్థలం చిక్కుకుంటున్నది. ప్రభుత్వం స్థలం పక్కనే పట్టా భూమి ఉన్నది. ఇందులోకి వెళ్లేందుకు ఇంతకుముందు 33 ఫీట్ల గొలుసు రోడ్డు మాత్రమే ఉండేది. ఐదంతస్థుల వరకు భవన నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉండేది. ప్రస్తుతం 100 ఫీట్ల రోడ్డును ఈ పట్టా భూమిని ఆనుకునే నిర్మిస్తుండడంతో 30 నుంచి 40 అంతస్థుల వరకు నిర్మించేందుకు అనుమతి లభిస్తుంది. సదరు ప్రైవేటు స్థలం ఓ ప్రజాప్రతినిధి బంధువులకు సంబంధించినది కావడంతో వారికి లబ్ధి చేసేందుకు రోడ్డును నిర్మిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోచోట రేడియల్‌ రోడ్డు 30 ఎక్స్‌టెన్షన్‌ నుంచి ఔటర్‌ రింగురోడ్డు వరకు కొత్తగా వంద ఫీట్ల రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డుకు అడ్డుగా వస్తున్న సమాధులను తొలగించి మరీ నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్డు నుంచి 60 మీటర్ల దూరం మరో 100 ఫీట్ల రోడ్డును నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా అవసరం లేకపోయినా ప్రభుత్వ భూమి చుట్టూ మూడు వైపులా రోడ్డును నిర్మిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమికి ఒకవైపున ఇప్పటికే రేడియల్‌ రోడ్డు ఉండగా మిగిలిని మూడు వైపులా 100 ఫీట్ల రోడ్డు అవసరం లేదని, అయినా పక్కనే ఉన్న ప్రయివేట్‌ భూములకు ప్రయోజనం కల్పించడం కోసమే నిర్మిస్తున్నారని విమర్శలున్నాయి. 


డంపింగ్‌ యార్డు స్థలాన్ని చూపించాలి

టీఎ్‌సఐఐసీ నిర్మిస్తున్న రోడ్ల మధ్యలోనే ప్రజా అవసరాల కోసం వినియోగిస్తున్న స్థలం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సర్వే నంబరు 30లోని ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గ్రామస్థులకు పంపిణీ చేసింది. ఇదే సర్వే నంబర్‌లో కొంత భూమిని గ్రామ అవసరాలకు కోసం అధికారులు కేటాయించారని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని డంప్‌యార్డుగా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ స్థలం చుట్టూ నాలుగు దిక్కులా రోడ్లను నిర్మించడంతో మధ్యలో చిక్కుకున్నదని తెలియజేశారు. ఈ స్థలాన్ని గుర్తించి డంపుయార్డు కోసం అప్పగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అవసరమైతేనే రోడ్లు ఏర్పాటు చేయాలని, అనవసరంగా ప్రజాధనాన్ని విలువైన భూములను వృథా చేయరాదని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-09-08T05:30:00+05:30 IST