కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన రచ్చబండ

ABN , First Publish Date - 2022-05-19T04:55:27+05:30 IST

రాబోయే నెల రోజుల పాటు గ్రామ గ్రామాన రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు.

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన రచ్చబండ

ప్రజల్లోకి వరంగల్‌ డిక్లరేషన్‌ అంశాలు 

మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి 

మెదక్‌, మే 18: రాబోయే నెల రోజుల పాటు గ్రామ గ్రామాన రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మెదక్‌ డీసీసీ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి వరంగల్‌ డిక్లరేషన్‌ అంశాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లనున్నామని తెలిపారు. రైతుల కోసం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతుకి రూ.15 వేలు, ఉపాధి కూలీలకు రూ.12 వేలు, పంటలకు గిట్టుబాటు ధర, చెక్కర కర్మాగారాలను తెరిపించడం, పసుపు బోర్డ్‌, ధరణి పోర్టల్‌ రద్దు లాంటి చాలా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మెదక్‌ నియోజకవర్గంలో ఈ నెల 21న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పద్మారావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కృష్ణ, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, మెదక్‌, ఘనపూర్‌ మండలాధ్యక్షులు శంకర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Read more