‘ఏడుపాయల’లో నీట మునిగి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-06-07T05:52:00+05:30 IST

ఏడుపాయలలో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు.

‘ఏడుపాయల’లో నీట మునిగి ఇద్దరి మృతి

చెక్‌డ్యాంలో మునిగి ఒకరు.. ఆనకట్టలో మరొకరు

పాపన్నపేట, జూన్‌ 6: ఏడుపాయలలో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు.  మృతుల బంధువులు, ఎస్‌ఐ విజయ్‌నారాయణ తెలిపిన వివరాల ప్రకారం..  కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం దుర్గి గ్రామానికి చెందిన బాకా సాయిలు (42) ఆదివారం ఏడుపాయలలో అమ్మవారి దర్శనార్థం బంధువులతో కలిసి వచ్చాడు. సాయంత్రం  అందరూ  చెక్‌డ్యాంలో స్నానానికి వెళ్లగా సాయి లు ప్రమాదవశాత్తు నీటమునుగుతూ కేకలు వేయగా బంధువులు రక్షించేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతు డు సాయిలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో ఘటనలో..  వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చక్రంపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ హకీం (28) ఆదివారం స్నేహితులతో కలిసి ఏడుపాయలలో విందుకు హాజరయ్యాడు. సాయంత్రం అందరూ ఆనకట్టలో స్నానానికి వెళ్లగా హకీం ప్రమాదవశాత్తు నీట మునుగుతుండగా స్నేహితులు రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. హకీంకు భార్య, ఆరేళ్ల కూతురు ఉన్నారు. కాగా నీటమునిగి ఇద్దరు గల్లంతరయ్యారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలాలకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా వారి జాడ లభించలేదు. ఆదివారం రాత్రి కావడంతో తిరిగి సోమవారం ఉదయం గజ ఈతగాళ్లు గాలించగా  రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  కాగా ఏడుపాయలకు వచ్చిన భక్తుల మంచి, చెడుల  బాధ్యత పాలక మండలి గానీ, ఆలయ సిబ్బంది గానీ పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలైన ఆనకట్ట, చెక్‌డ్యాం వద్ద ప్రమాదాలు జరుగకుండా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే భక్తులు నీట మునిగి చనిపోతున్నారని ఆరోపిస్తున్నారు.   

Updated Date - 2022-06-07T05:52:00+05:30 IST