రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-08-18T04:54:52+05:30 IST

గుర్తుతెలియని కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం కోహెడ మండలంలోని సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

గుర్తు తెలియని కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఘటన


కోహెడ, ఆగస్టు 17 : గుర్తుతెలియని కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం కోహెడ మండలంలోని  సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. మండలంలోని బత్తుల వానిపల్లి గ్రామానికి చెందిన లింగాల బాలయ్య (60), ర్యాగటి రాజు(48) కోహెడలో జరిగిన పెళ్లికి టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై వెళ్లారు. పెళ్లి చూసుకుని తిరిగి బత్తులవానిపల్లి గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో సిద్దిపేట -హనుమకొండ ప్రధాన రహదారిపై నాగసముద్రాల క్రాసింగ్‌ వద్ద సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌కు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న టీవీఎస్‌ ఎక్సెల్‌ను ఢీకొన్నది. దీంతో ఎక్సెల్‌ వాహనంపై ఉన్న ఇద్దరు ఎగిరిపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. వారిని ఢీకొన్న కారు ఆపకుండానే వెళ్లిపోయారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు మృతదేహాలను చూసి భావురుమని విలపించారు. ఎస్‌ఐ జి.నరేందర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. బాలయ్యకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజుకు భార్య లక్ష్మి, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి గురైన కారును పట్టుకుంటామని తెలిపారు.

Read more