చెరువులో మునిగి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-09-27T05:46:33+05:30 IST

చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది.

చెరువులో మునిగి ఇద్దరి మృతి
మృతి చెందిన మహేష్‌, అరవింద్‌ (ఫైల్‌)

అంత్యక్రియలకు వెళ్లి స్నానం చేస్తుండగా ఘటన.. కొత్తగూడెంలో విషాదం

హత్నూర, సెప్టెంబరు 26: చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి  చెందిన సంఘటన మండలంలోని కొత్తగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  కొత్తగూడెం గ్రామానికి చెందిన  ఓ వృద్ధుడు మృతి చెందగా, సోమవారం కుటుంబీకులు గ్రామశివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో మృతుడికి దగ్గరి బంధువులైన చిలువరి మహేష్‌ (17), చిలువరి అరవింద్‌ (16) అంత్యక్రియల్లో పాల్గొని బంధువులతో కలిసి గ్రామ సమీపంలోని చెరువులోకి స్నానానికి వెళ్లారు. అక్కడ  స్నేహితులతో పాటు మహేష్‌, అరవింద్‌ కూడా చెరువులోకి దిగి కొంత లోపలికి వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో గల లోతైన గుంతలోకి ఒక్కసారిగా జారారు. నీటిలో మునుగుతూ అరుస్తుండడంతో అక్కడే ఉన్న కుటుంబీకులు బంధువులు వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారు పూర్తిగా నీట మునిగిపోయారు.  కుటుంబీకులు, బంధువులు వారికోసం గాలించగా అరగంట తర్వాత ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా మహేష్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. అరవింద్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబీకులు, బంధువులు చూస్తుండగానే ఇద్దరు విద్యార్థులు మృత్యుఒడిలోకి జారుకోవడంతో కొత్తగూడెంలో విషాదఛాయలు అలుమకున్నాయి.  ఈ విషయమై హత్నూర ఎస్‌ఐ లక్ష్మారెడ్డిని ఆంధ్రజ్యోతి ఫోన్‌ ద్వారా సంప్రదించగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాధానం ఇచ్చారు. 

Read more