తూప్రాన్‌లో తూతూమంత్రంగా పల్లెప్రగతి

ABN , First Publish Date - 2022-06-08T05:01:54+05:30 IST

పల్లెలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలు తూప్రాన్‌ మండలంలో మొక్కుబడిగా సాగుతున్నాయి.

తూప్రాన్‌లో తూతూమంత్రంగా పల్లెప్రగతి
కోనాయిపల్లిలో ట్రాన్స్‌పార్మర్‌ వద్ద ఒరిగిన విద్యుత్‌ స్తంభం

తూప్రాన్‌రూరల్‌, జూన్‌ 7: పల్లెలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలు తూప్రాన్‌ మండలంలో మొక్కుబడిగా సాగుతున్నాయి. రోజూ గంటసేపు మొక్కుబడిగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్న సంఘటనలే కనిపిస్తున్నాయి. పాత బిల్లులు రాకపోవడంతో సర్పంచుల్లో నిరాసక్తత, నైరాశ్యం పెరిగిపోయింది. మురుగు కాలవలు తీయడం, చెట్లను పెంచడానికే తమను వాడుకుంటున్నారనే ఆవేదన వారిలో ఉంది. దీంతో మొక్కుబడిగా పనులు సాగుతున్నాయి. అధికారులు సైతం పల్లెప్రగతిపై అశ్రద్ధ వహిస్తున్నారు. సోమవారం ఇమాంపూర్‌లో ఆకస్మికంగా పర్యటించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ శరత్‌కుమార్‌ మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫొటోలకే పరిమితమవుతున్న పనుల తీరు

మంగళవారం ఐదోరోజు పల్లెప్రగతిలో విద్యుత్‌ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి పవర్‌డే పాటించాల్సి ఉండగా ఎక్కడా ఒక కొత్త స్తంభాన్ని వేసినట్లు, వదులుగా ఉన్న తీగలను, సరిచేసినట్లు, వంగిన స్తంభాలను సరిచేసిన దాఖలాలులేవు. గ్రామాలకు అధికారులు ఎవరు వచ్చి నా పల్లెప్రకృతి వనాలను, డంపింగ్‌ యార్డులను చూసి ఫొటో లు దిగి వెళ్లిపోతున్నారు తప్ప ఐదో విడతలో మార్పు అనేది కనిపించడం లేదు. గ్రామస్థాయి అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు తప్పకుండా పల్లెప్రగతిలో పాల్గొనాలనే ఆదేశాలుండగా అలాంటివేవీ కనిపించడంలేదు. పంచాయతీ కార్యదర్శులు మాత్రం అంతా బాగానే ఉన్నట్లు, అందరూ హా జరవుతున్నట్లు నివేదికలు తయారు చేసి పంపిస్తున్నట్లు స మాచారం. నాలుగు విడతల్లో జరిగిన పనుల ప్రగతిపై పంచాయతీ కార్యాలయాల వద్ద అప్పుడు, ఇప్పుడు ఎలా మార్పు జరిగిందో? ఫొటో ఆల్బంను తయారు చేయాలని, జరిగిన పనులతో బోర్డులను ఏర్పాటు చేయలని మార్గదర్శకాల్లో ఉండగా ఎక్కడా పాటించిన దాఖలాలు కనిపించడం లేదు.




Updated Date - 2022-06-08T05:01:54+05:30 IST