వేర్వేరు ప్రాంతాల్లో చెరువుల్లో పడి ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2022-12-10T00:05:11+05:30 IST

మెదక్‌ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు చెరువుల్లో పడి ముగ్గురు మృతి చెందారు.

వేర్వేరు ప్రాంతాల్లో చెరువుల్లో పడి ముగ్గురి మృతి
మహిపాల్‌(ఫైల్‌)

చిల్‌పచెడ్‌/శివ్వంపేట/చిన్నశంకరంపేట, డిసెంబరు 9: మెదక్‌ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు చెరువుల్లో పడి ముగ్గురు మృతి చెందారు. చిల్‌పచెడ్‌ మండలంలోని గౌతాపూర్‌ గ్రామానికి చెందిన అన్నసారం యాదగిరి(28) గురువారం తన తాత అంత్యక్రియల్లో పాల్గొని గ్రామంలోని పెద్ద చెరువులో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో.. శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన మానుక కొమురయ్య(35) అదే గ్రామానికి చెందిన సాయిలు, గోనయ్యతో కలిసి గురువారం రాత్రి స్థానిక వీరారెడ్డి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కొమురయ్య నీట మునిగాడు. రాత్రి ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు కొమురయ్య వెంట వెళ్లిన ఇద్దరినీ నిలదీయగా కుంటలో పడినట్టు చెప్పారు. శుక్రవారం ఉదయం గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్న శంకరంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట పంచాయతీ పరిధి మైదాకుపల్లి గ్రామానికి చెందిన రెడ్డి మహిపాల్‌ (27) శుక్రవారం కామారం గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కూలీ పనికి వెళ్లాడు. గ్రామ శివారులోని చెరువు వద్ద వ్యవసాయ పొలంలో మరో కూలీ పడాల శ్యాములుతో కలిసి బోరు మోటారు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారిన మహిపాల్‌ చెరువులో మునిగిపోయాడు. తోటికూలీ రక్షించేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుభా్‌షగౌడ్‌ తెలిపారు.

Updated Date - 2022-12-10T00:05:14+05:30 IST