గుట్టను తవ్వేస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-12T00:12:22+05:30 IST

కొంతమంది ప్రభుత్వ భూముల నుంచి మట్టిని దర్జాగా తవ్వేస్తున్నారు. గుట్టలను యథేచ్ఛగా తొలిచివేస్తున్నారు. మట్టిని తవ్వి తరలిస్తూ తమ సొంత స్థలాలకు దారులు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

గుట్టను తవ్వేస్తున్నారు
పోతంశెట్టిపల్లి శివారులో ఎక్స్‌కవేటర్‌తో గుట్టను తొలిచి మట్టిని తరలిస్తున్న దృశ్యం

మితిమీరుతున్న మట్టి మాఫియా ఆగడాలు

కొల్చారం, డిసెంబరు 11 : కొంతమంది ప్రభుత్వ భూముల నుంచి మట్టిని దర్జాగా తవ్వేస్తున్నారు. గుట్టలను యథేచ్ఛగా తొలిచివేస్తున్నారు. మట్టిని తవ్వి తరలిస్తూ తమ సొంత స్థలాలకు దారులు వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి శివారులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో నుంచి తమ సొంత పొలంలోకి వెళ్లేందుకు పక్కనే ఉన్న గుట్టను తవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తూ యథేచ్చగా దారి వేసుకుంటున్నారు కొందరు బడా భూస్వాములు. ఇదంతా కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే జరుగుతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు చూసి కూడా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులో భూముల ధరలు కోట్లల్లో పలుకుతున్నాయి. భూమికి ధర రావాలంటే రోడ్డు వెయ్యాలి కానీ ప్రభుత్వ భూముల నుంచి మట్టి తీసి తమ సొంత పొలాలకు దారి వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా గుట్టలను తవ్వి మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తరలించి తమ పొలాలకు దారి వేసుకునేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ అక్రమ మట్టి తరలింపు విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే ఈ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం.

- చంద్రశేఖర్‌, తహసీల్దార్‌

Updated Date - 2022-12-12T00:12:24+05:30 IST