పోడు భూముల సమస్యను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-12T23:45:21+05:30 IST

ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌

పోడు భూముల సమస్యను పరిష్కరించాలి
పాఠశాలలో ఉపాధ్యాయులను నిలదీస్తున్న ఎమ్మెల్యే

మాసాయిపేట, డిసెంబరు 12: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల మంజూరుకు రూ.3 లక్షల హామీని నెరవేర్చాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి, నడిమి తండా, పిల్లిగుట్ట తండా, పోతన్‌పల్లి గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. చెట్ల తిమ్మాయిపల్లిలో గ్రామస్థులతో సమావేశమై పోడు భూముల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పోడు భూములు, గిరిజనుల ఇళ్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే పరిష్కరించేలా ఒత్తిడి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిల్లిగుట్ట తండాలో గిరిజనుల గుడిసెల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే ఇళ్లు మంజూరయ్యేలా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నడిమి తండాలో ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

గిరిజన తండాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో మాసాయిపేట పోస్టుమాస్టర్‌ కూలీలకు వేతనాలు చెల్లించకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమాస్టర్‌పై జిల్లా తపాలా అధికారికి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చెట్ల తిమ్మాయిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులే హాజరుకావడంతో ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాలలో విద్యార్థులకు కనీసం ఓనమాలు సైతం నేర్పడం లేదని, జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయనవెంట చెట్ల తిమ్మాయిపల్లి సర్పంచ్‌ మోహన్‌ రాథోడ్‌, నడిమి తండా సర్పంచ్‌ స్వాతి శ్రీనివాస్‌, ఎంపీటీసీ హోలియా నాయక్‌, బీజేపీ నాయకులు శైలేందర్‌రెడ్డి, బాబు, శ్రీనివాస్‌ ఉన్నారు.

ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వైద్య పరీక్షలు

తూప్రాన్‌: తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని రోజులుగా రఘునందన్‌రావు కుడికాలుకు నొప్పి వస్తుండడంతో వైద్యుల సూచనల మేరకు ఎమ్మెల్యేకు ఎక్స్‌రే తీయగా.. మజిల్స్‌ సమస్య ఉన్నదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అమర్‌సింగ్‌ తెలిపారు. నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఎమ్మెల్యేకు వైద్యులు సూచించారు.

Updated Date - 2022-12-12T23:45:22+05:30 IST