దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యం.. ఏకగ్రీవ తీర్మానాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-12-02T00:19:49+05:30 IST

మొన్న నార్సింగ్‌, రాయపోల్‌ మండలాలు, నిన్న అక్బర్‌పేట-భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసుకుని నూతన ఉత్సాహంలో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో మరో కొత్త ప్రతిపాదనను లేవనెత్తారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లేందుకు, పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు నూతన రెవెన్యూ డివిజన్‌ డిమాండ్‌ తెరపైకొచ్చింది.

దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ సాధనే లక్ష్యం.. ఏకగ్రీవ తీర్మానాలకు శ్రీకారం

మొదటగా తీర్మానం చేసిన దుబ్బాక మున్సిపల్‌ పాలక మండలి

దుబ్బాక, డిసెంబరు 1 : మొన్న నార్సింగ్‌, రాయపోల్‌ మండలాలు, నిన్న అక్బర్‌పేట-భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసుకుని నూతన ఉత్సాహంలో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో మరో కొత్త ప్రతిపాదనను లేవనెత్తారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లేందుకు, పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు నూతన రెవెన్యూ డివిజన్‌ డిమాండ్‌ తెరపైకొచ్చింది. ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారని స్థానిక అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏకగ్రీవ తీర్మానాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దుబ్బాక మున్సిపాలిటీ నుంచి తొలి అడుగు పడింది. గురువారం దుబ్బాక మున్సిపల్‌ పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి చైర్‌పర్సన్‌ గన్నె వనితారెడ్డి అధ్యక్షతన దుబ్బాక కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దశల వారీగా నియోజకవర్గంలోని గ్రామాల నుంచి తీర్మానాలు చేయనున్నారు. నియోజక వర్గ ప్రజల ఆమోదంతో రెవెన్యూ డివిజన్‌ సాధించే దిశగా ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ ప్రభాకర్‌రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కూడా కలవనున్నట్టు తెలిసింది.

క్షేత్రస్థాయి నుంచి సానుకూలతకు ప్రయత్నం

బుధవారం అట్టహాసంగా ప్రారంభించిన అక్బర్‌పేట - భూంపల్లి మండల ప్రారంభోత్సవంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వేడి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే తామే మండలాన్ని ఏర్పాటు చేయించామని, మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌ మెడలు వంచి తెచ్చామనే ప్రకటనలు సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ చెవినపడగా ఆయనే స్వయంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ముందు వీటిని ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై తీవ్రమైన వాఖ్యలు చేశారు. ఈ దశలో మరో అడుగు ముందుకు వేయాలనే ప్రయత్నంలో భాగంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ సాఽధించడానికి పావులు కదుపుతున్నారు. మొదట క్షేత్రస్థాయి నుంచి సానుకూల డిమాండ్‌ను ప్రజల్లో పెట్టి అనంతరం మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్‌ను కలవాలనే ప్రయత్నంలో ఎంపీ ఉన్నారు. అందుకు దుబ్బాక మున్సిపల్‌ పాలక మండలి గురువారం ఏకగ్రీవ తీర్మాన చేసింది. రెండవ దఫ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ తీర్మానాలను చేపట్టి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా రెవెన్యూ డివిజన్‌ను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెవెన్యూ డివిజన్‌తో పూర్వవైభవం

పాత తాలుకా, సమితిగా ఉన్న దుబ్బాక ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతున్నది. ఇటీవల పరిణామాలతో దుబ్బాక అభివృద్ధి, వ్యాపారపరంగా వెనుకంజ వేసింది. తాలుకాగా 68 గ్రామాల పరిధిలో ఉండేది. వ్యాపార కేంద్రంగా విలసిల్లేది. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌ ఈ మూడు జిల్లాల సరిహద్దుగా ఆనుకుని ఉన్నది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో మళ్లీ పూర్వవైభవం సంతరించుకునే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ముందుకెళ్లి సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Updated Date - 2022-12-02T00:19:50+05:30 IST