మార్చిలోనే భగ భగ

ABN , First Publish Date - 2022-03-17T05:19:38+05:30 IST

ఎండాకాలం మొదలైందో లేదో భానుడు భగ్గుమంటున్నాడు. ఇన్నాళ్లు చలితో వణికిపోయిన జిల్లావాసులను ముదురుతున్న ఎండలు చమటలు పట్టిస్తున్నాయి. ఈ యేడు మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 10గంటల నుంచే వేసవి తాపం మొదలవుతున్నది. ఇక మధ్యాహ్నమైతే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

మార్చిలోనే భగ భగ
మధ్యాహ్నం సమయంలో ఎండ వేడికి సిద్దిపేట పాతబస్టాండ్‌ చౌరస్తాలో తగ్గిన జనసంచారం

జిల్లాలో ముదురుతున్న ఎండలు

40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

మధ్యాహ్నమైతే రోడ్లు నిర్మానుష్యం

వచ్చే ఐదారు రోజుల్లో మరింత తీవ్రం

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 16 : ఎండాకాలం మొదలైందో లేదో భానుడు భగ్గుమంటున్నాడు. ఇన్నాళ్లు చలితో వణికిపోయిన జిల్లావాసులను ముదురుతున్న ఎండలు చమటలు పట్టిస్తున్నాయి. ఈ యేడు మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.  ఉదయం 10గంటల నుంచే వేసవి తాపం మొదలవుతున్నది. ఇక మధ్యాహ్నమైతే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.  


క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

గడిచిన ఏడాది వేసవిలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒకట్రెండు రోజులు మాత్రమే నాడు ఈ పరిస్థితి తలెత్తింది. కానీ ప్రస్తుతం మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరువైంది. వారం రోజుల నుంచి క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. రాబోయే ఐదారు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తున్నది. వేసవి మొదట్లోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని జనం బెంబేలెత్తుతున్నారు. తొగుట మండలం తుక్కాపూర్‌, చేర్యాల మండలం చిట్యాల, దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. 


శీతల పానీయాలకు గిరాకీ

జిల్లాలో మండుతున్న ఎండలతో ఉక్కపోత పెరిగిపోవడంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు వేసవి నేస్తాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే శీతల పానీయాలకు సంబంధించిన వ్యాపారాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో ఒకేచోట స్థిరమైన వ్యాపారాలు ఉండేవి. కానీ ఇప్పుడు మొబైల్‌ వ్యాపారాలతో జనసంచార ప్రాంతాల్లో అడ్డా వేస్తున్నారు. చెరకు రసం, సోడాలు, పుచ్చకాయలు, కొబ్బరి బొండాలు, లస్సీ, పండ్ల రసాలు, మజ్జిగ విరక్రయ వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఈ చల్లని పానీయాలను తాగుతూ సేదతీరుతున్నారు. సిద్దిపేటలోని మెదక్‌ రోడ్డులో ఉన్న ఓ కొబ్బరి బొండాల దుకాణంలో  ఐదారు రోజుల క్రితం రోజుకు 40 బొండాలను విక్రయించగా ప్రస్తుతం 150 వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. మిగతా వ్యాపారాల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. 


అప్రమత్తంగా ఉండాల్సిందే

 - డాక్టర్‌ రజినీష్‌, ఫిజిషియన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సిద్దిపేట

 - ఎండలో ఎక్కువ సేపు ఉంటే తల తిరగడం, తలనొప్పి, సొమ్మసిల్లి పడిపోయే లక్షణాలు ఉంటాయి. రక్త నాళాలు వ్యాకోచించి మెదడుకు సరిగ్గా రక్తం అందదు. ఈ పరిస్థితిని హీట్‌ సింకోప్‌ అంటారు. ఇది వడదెబ్బకు దారితీస్తుంది. 

- రాత్రివేళలో కాలిపిక్కలు పట్టేసినట్లు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా పిల్లల్లో, పెద్దల్లో వస్తుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలో లవణాలు కోల్పోవడం వల్ల కండరాలకు మెదడు నుంచి ఆదేశాలు సరిగ్గా అందవు. దీనికి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగిస్తే ఫలితం ఉంటుంది.

- ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లవద్దు. ఏదైనా పని ఉంటే ఉదయం 11గంటల లోపు, సాయంత్రం 4 తర్వాత వెళ్లాలి. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే దుస్తులు, గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. 

- ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగాలి.

- ఎండలో తిరిగినప్పుడు చెమటతోపాటు శరీరంలోని ఎలక్ర్టోరల్స్‌ కూడా బయటకుపోతాయి. కావున ఓఆర్‌ఎస్‌ నీళ్లు, ఉప్పు వేసిన నిమ్మరసం తాగాలి. 

- ఈ వేసవిలో దాహం అయినా కాకున్నా 3 లీటర్లు కనీసం మంచినీళ్లు తాగాలి. 

- పుచ్చకాయ, నిమ్మకాయ, కీరదోసలు ఎక్కువగా తినాలి. మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. చేపలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

- మద్యం, సిగరేట్‌, బిర్యానీలు, మసాలాలు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 

-  ఎండలు ఇప్పటికే తీవ్రమయ్యాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు సంభవించవచ్చు. 


పదిరోజులుగా జిల్లాలో నమోదైన సగటు ఉష్ణోగ్రతలు

తేదీ       ఉష్ణోగ్రత

6 33.6

7 33.7

8 33.9

9 34.1

10 34.4

11 34.6

12 34.5

13 34.6

14 35.2

15 36.4

16 39


Read more