సరిపడా గోనె సంచులు అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2022-11-11T23:33:28+05:30 IST

ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన గోనె సంచులను సమకూర్చుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

సరిపడా గోనె సంచులు అందుబాటులో ఉంచాలి
ధాన్యం కొనుగోళ్లను పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌

రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌

మెదక్‌/మెదక్‌ అర్బన్‌, నవంబరు 11: ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన గోనె సంచులను సమకూర్చుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మెదక్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోనె సంచులు, హమాలీల కొరత, రవాణా సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్‌మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ గోదాముల్లో ధాన్యం నిల్వకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా చూస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని గోనె సంచులను సరఫరా చేస్తున్నామని, అన్‌లోడింగ్‌ త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రాజ్‌పల్లి, మంబోజిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కమిషనర్‌ పరిశీలించి రైతులతో మాట్లాడారు. డీఎం గోపాల్‌, డీఎ్‌సవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:33:28+05:30 IST