ప్రజావాణిలో అర్జీల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు

ABN , First Publish Date - 2022-07-05T05:45:55+05:30 IST

సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజాసమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు

ప్రజావాణిలో అర్జీల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు

సమస్యల పరిష్కారానికి అడుగులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక చొరవ


 సంగారెడ్డిరూరల్‌, జూలై4: సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రజాసమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా కౌంటర్లలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. వారి పరిధిలో సమస్యలను పరిష్కరించే వాటిని అక్కడిక్కడే పరిష్కరించారు. పలు సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణాలను అధికారులు అర్జీదారులకు తెలపడంతోపాటు కలెక్టర్‌కు వివరించారు. 


ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా వాటిని వీలైనంత వేగవంతంగా పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. పరిష్కారం కాని సమస్యల విషయమై అర్జీదారులకు వివరించాలని అధికారులకు సూచించారు. గత వారం వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని అర్జీలు వచ్చాయో వా టికి అప్లికేషన్‌ ట్రాకింగ్‌ ఉంటుందన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కరించామన్నది వచ్చే వారం పరిశీలిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌

మెదక్‌అర్బన్‌, జూలై 4: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి ద్వారా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో నలుమూలల నుంచి 11 వినతులు వచ్చాయి. అందులో భూ సమస్యలు, వివిధ అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులతోపాటు ప్రజావాణిలో వచ్చిన వాటిని పెండింగ్‌లో లేకుండా పరిష్కారించాలని సూచించారు. మెదక్‌ మండల పరధిలోని తిమ్మక్కపల్లి తండాకు చెందిన సలావత్‌ దుర్గ్యా కోరిన వెంటనే నూతన ట్రే సైకిల్‌ను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, డీఎ్‌సవో శ్రీనివాస్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.


బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

పోలీసు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మెదక్‌ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల ను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఫోన్‌లో ఆదేశించారు. 


Read more