నాలుగురోజులుగా మంజీర పాయల్లో గొర్రెల కాపర్లు

ABN , First Publish Date - 2022-09-12T05:12:46+05:30 IST

నాలుగురోజులుగా మంజీర పాయల్లో గొర్రెల కాపర్లు

నాలుగురోజులుగా మంజీర పాయల్లో గొర్రెల కాపర్లు
మంజీరా నది పాయలో చిక్కుకున్న గొర్రెలకాపర్లు

వరదలో చిక్కుకున్న నారాయరావుపేట జిల్లా వ్యక్తులు

పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ 


కొల్చారం, సెప్టెంబరు 11: నారాయణపేట జిల్లాకు చెందిన ఆరుగురు గొర్రెలకాపరులు గొర్రెలతో సహా మెదక్‌ జిల్లాలోని మంజీరాపాయల్లో నాలుగురోజులుగా చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎగువన ఉన్న సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్‌ జిల్లా పరిధిలోని మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఘనపురం ఆనకట్ట(వనదుర్గా ప్రాజెక్టు)కు శుక్రవారమే పెద్దఎత్తున వరద నీరు వచ్చింది. కట్టపై నుంచి వరద పొంగిపొర్లుతున్నది. అయితే నారాయణపేట జిల్లాకు చెందిన ఆరుగురు గొర్రెలకాపరులు 1700 గొర్రెలను మేత మేపుకుంటూ మెదక్‌ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్‌ శివారులో టేకుల బొద్దే వద్ద ఉన్న మంజీర పాయల్లోకి వెళ్లారు. గుట్టల మధ్య వారు గొర్రెలను మేపుకుంటూ ఉండగా శుక్రవారం అకస్మాత్తుగా ఘనపూర్‌ ఆనకట్టపై నుంచి వరద పొంగి దిగువకు ప్రవహిస్తుండడంతో కిష్టాపూర్‌ శివారులో టేకుల బొద్దే వద్ద మంజీర పాయల్లో  గొర్రెలతో సహా గొర్రెలకాపర్లు మల్లేశ్‌, చిన్నప్ప, మల్లప్ప, హనుమంతు, అనిల్‌, రాజు చిక్కుకున్నారు. ఒడ్డుకు చేరుకునే అవకాశం లేకపోవడంతో నాలుగు రోజులుగా వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ తమను రక్షించే వారి కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని, రాష్ట్ర గొర్రెల, మేకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపుమలిశెట్టి ఆదివారం ఘటన స్థలం సమీపంలోకి వెళ్లారు. గొర్రెలకాపర్లతో ఫోన్‌లో మాట్లాడారు. అధైర్యపడవద్దని వారికి సూచించారు. తమ వద్ద వారం రోజులకు సరిపడే సామగ్రి వుందని కాపర్లు ఫోన్లో తెలిపారు. అనంతరం రాష్ట్ర గొర్రెల, మేకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపుమలిశెట్టి మాట్లాడుతూ అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే వారికి సహాయసహకారాలు అందించాలని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులు మంజీర నది వరద ఉధృతిపై ముందస్తుగా సమాచారం అందించి గొర్రెల, మేకల పెంపకందారులను జాగ్రత్త వహించాలని ఎందుకు సూచనలివ్వలేదని ప్రశ్నించారు.

Read more