సర్వర్‌ పరేషాన్‌

ABN , First Publish Date - 2022-05-31T05:28:01+05:30 IST

పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈనెలాఖరు వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. పలు రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో బోగస్‌ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్‌లో నిధులు కాజేసినట్లు గుర్తించిన కేంద్రం తాజాగా నిబంధనలు మార్చడంతో ఈకేవైసీని అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి అయింది.

సర్వర్‌ పరేషాన్‌
బెజ్జంకిలోని సీఎస్‌సీ సెంటర్లో ఈ కేవైసీ అప్‌డేట్‌ చేయించుకునేందుకు ఎదురుచూస్తున్న రైతులు

పీఎం కిసాన్‌ ఈకేవైసీ నమోదుకు అంతరాయం

ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ కాకపోవడంతో రైతుల అవస్థలు

సీఎ్‌ససీ, ఆధార్‌ సెంటర్లలో బారులు

అవగాహన లేమితో అయోమయం


బెజ్జంకి, మే 30 : పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈనెలాఖరు వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. పలు రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో బోగస్‌ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్‌లో నిధులు కాజేసినట్లు గుర్తించిన కేంద్రం తాజాగా నిబంధనలు మార్చడంతో ఈకేవైసీని అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి అయింది. గ్రామాల వారీగా ఏఈవోలు ప్రచారం చేపట్టినప్పటికీ ఇప్పటివరకు జిల్లాలో చాలా మంది రైతులు ఈకేవైసీని అప్‌డేట్‌ చేసుకోలేదు. ఇప్పుడు చేసుకోవాలని రైతులు ముందుకు వస్తున్నా సర్వర్‌ మొరాయిస్తున్నది. జిల్లాలో ఈకేవైసీ నమోదుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింకు లేకపోవడంతో ఈకేవైసీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. 


కేంద్రాల వద్ద పడిగాపులు

కొన్ని నెలల నుంచి ప్రభుత్వం ఈకేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించినప్పటికీ రైతులు పెడచెవిన పెట్టారు. కానీ ఇప్పుడు పీఎం కిసాన్‌ నిధులు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి కావడంతో రైతులు పనులన్నీ పక్కనపెట్టి ఆధార్‌, సీఎ్‌ససీ, మీసేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చివరి రోజుల్లో ప్రక్రియ కాస్త పుంజుకున్నా పీఎం కిసాన్‌ సర్వర్‌, ఆధార్‌ సర్వర్‌ నెమ్మదించడంతో ఈకేవైసీ అప్‌డేట్‌ ప్రక్రియ నత్తనడక సాగుతుంది.


అవగాహనా లేమి

గతంలో పీఎం కిసాన్‌ నిధి పొందుతున్న రైతులు కేవలం తమ ఆధార్‌ కార్డును తీసుకెళితే చాలు మీసేవ, ఈఈ సెంటర్లలో ఈకేవైసీ అప్‌డేట్‌ చేస్తారు. ఆధార్‌కార్డుకు ఫోన్‌ నంబర్‌ లింక్‌ అయి ఉంటే ఫోన్‌ ద్వారా కూడా చేసుకోవచ్చు. లింక్‌ లేకుంటే మాత్రం ఆధార్‌ సెంటర్లలో వేలిముద్ర ద్వారా ఈకేవైసీ అప్‌డేట్‌  చేసుకోవాలి. కొత్తగా పీఎం సమ్మాన్‌ నిధి కోసం దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఆధార్‌, బ్యాంక్‌, పట్టాదారు పాసుపుస్తకాలు తెచ్చుకుని ఏదైనా ఆన్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. 2019 సంవత్సరం ముందు పట్టాదారు పాసుపుస్తకం పొందివున్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పటికే లబ్ధిపొందుతున్న పొందుతున్నవారు కూడా వివిధ పత్రాలు తెచ్చుకోవాలని కొన్నిసెంటర్ల వారు చెబుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఈకేవైసీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆ ప్రదేశంలో ఉండే వారు ఆ ఊరి వారి వద్దే చేసుకోవాలని, కేవలం మీ సేవ సెంటర్లలో మాత్రమే నమోదుచేయించుకోవాలని కొందరు అవగాహనా లేమితో చెప్పడంతో అయోమయానికి గురవుతున్నారు. 


గడువు పొడిగింపుపై గందరగోళం

ఈకేవైసీ అప్‌డేట్‌ చేసుకున్న రైతుల ఖాతాల్లోకి మంగళవారం నుంచి పీఎం కిసాన్‌ డబ్బులు పడతాయని ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. సోమవారం వరకు ఈకేవైసీ పూర్తిచేసుకున్న రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2వేల చొప్పున చెల్లిస్తారు. నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్‌ నుంచి డబ్బు నిలిపివేయనున్నారు. కానీ పీఎం కిసాన్‌ సర్వర్‌ మొరాయిస్తుండడంతో అప్‌డేట్‌ చేయించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈకేవైసీ అప్‌డేట్‌ చేయించుకునేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇంకా అధికారికంగా తమకు ఉత్తర్వులు వెలువడలేదని జిల్లా వ్యసాయాధికారులు చెబుతున్నారు.


నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా

పీఎం కిసాన్‌ డబ్బులు ఖాతాలో పడాలంటే వేలిముద్రను అప్‌డేట్‌ చేయించుకోవాలని ప్రభుత్వం చెప్పింది. నాలుగు రోజుల నుంచి ఈ కేవైసీ అప్‌డేట్‌ చేయించుకునేందుకు తిరుగుతున్న. ఎప్పుడు వచ్చినా సర్వర్‌ రావడంలేదని చెబుతున్నారు. సాయంత్రం వరకు చూసి రోజు ఇంటికి వెళ్తున్న. ఇంతవరకు ఈ కేవైసీ అప్‌డేట్‌ కాలేదు.

- ముక్కెర లత, మహిళా రైతు లక్ష్మీపూర్‌


ఈరోజే చివరి అవకాశం అంటున్నారు

 మూడు రోజుల నుంచి ఈ కేవైసీ చేయించుకునేందుకు వీరాపూర్‌ నుంచి బెజ్జంకికి రోజు వస్తున్న. ఎప్పుడు వచ్చినా కంప్యూటర్‌లో సైట్‌ రావడంలేదని చెబుతున్నారు. ఈరోజు వరకు అప్‌డేట్‌ చేయించుకున్న వాళ్లకు మాత్రమే డబ్బులు పడతాయి అంటున్నారు. రేపు ప్రభుత్వం ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారని కొందరు అంటున్నారు. నా ఖాతాలోకి డబ్బులు పడతాయో పడవో.

- మొండయ్య, రైతు, వీరాపూర్‌  


సైట్‌ ఎప్పుడొస్తుందో తెలియడం లేదు 

పీఎం కిసాన్‌ సర్వర్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. గంటల తరబడి సిస్టం ముందు కూర్చొని రైతులకు ఈ కేవైసీ అప్‌డేట్‌ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సైట్‌ రోజులో అప్పుడప్పుడు ఓపెన్‌ అవుతున్నా నిమిషాల వ్యవధిలోనే క్లోజ్‌ అవుతుంది.

- తిరుమల, సీఎ్‌ససీ నిర్వాహకురాలు


Read more