వాషింగ్టన్‌ డీసీ వేదికకు సంగారెడ్డి యువతి

ABN , First Publish Date - 2022-11-23T23:55:24+05:30 IST

జీవశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించిన సంగారెడ్డికి చెందిన యువతికి అరుదైన గౌరవం లభించింది. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఏబీ)లో డాక్టర్‌ గిరీశ్‌ కె రాధాకృష్ణన్‌ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేస్తున్న కిరణ్మయి జోషికి అమెరికా ఇనిస్టిట్యూట్‌ నుంచి ఆహ్వానం అందింది.

వాషింగ్టన్‌ డీసీ వేదికకు సంగారెడ్డి యువతి
పరిశోధనలు చేస్తున్న కిరణ్మయిజోషి

సెల్‌ బయాలజీ, బ్రుసెల్లోసిస్‌ ఇన్ఫెక్షన్‌ మీద కీలక ప్రసంగమిచ్చే అవకాశం

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 600 మంది దరఖాస్తు

16మందికే అవకాశం.. మన దేశం నుంచి కిరణ్మయి జోషి ఒక్కరే

సంగారెడ్డి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి), జీవశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించిన సంగారెడ్డికి చెందిన యువతికి అరుదైన గౌరవం లభించింది. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (ఎన్‌ఏబీ)లో డాక్టర్‌ గిరీశ్‌ కె రాధాకృష్ణన్‌ మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ చేస్తున్న కిరణ్మయి జోషికి అమెరికా ఇనిస్టిట్యూట్‌ నుంచి ఆహ్వానం అందింది. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సెల్‌ బయాలజీ (ఏఎ్‌ససీబీ), యూరోపియన్‌ మాలిక్యులర్‌ బయాలజీ ఆర్గనైజేషన్‌ (ఈఎంబీవో) సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో ‘కీలక ప్రసంగం’ చేసే అవకాశం లభించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో డిసెంబరు 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో తాను పరిశోధన చేస్తున్న... జంతువుల నుంచి సంక్రమించే బ్రుసెల్లోసిస్‌ అనే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ మీద కిరణ్మయి 15 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు. బ్రుసెల్లోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, నయం చేసేందుకు అవసరమైన పరిశోధనను కిరణ్మయి జోషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 600 మంది ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే 16 మందికి మాత్రమే సదస్సుల్లో ప్రసంగించే అవకాశం దక్కింది. అందులో మనదేశం నుంచి కిరణ్మయి ఒక్కరికే ఈ అవకాశం రావడం విశేషం! వాషింగ్టన్‌ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయో టెక్నాలజీ విభాగం ఆమెకు అనుమతినిచ్చింది. అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం మనదేశం నుంచి తనకు రావడం సంతోషంగా ఉందని కిరణ్మయి ‘ఆంధ్రజ్యోతి’కి పేర్కొన్నారు.

Updated Date - 2022-11-23T23:55:25+05:30 IST