సంగారెడ్డి చెత్త.. నర్సాపూర్‌లో డంప్‌

ABN , First Publish Date - 2022-08-21T05:30:00+05:30 IST

ఓ వైపు ప్రజలకు పరిశుభ్రత పాటించాలని, అనారోగ్యం గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేసే మున్సిపల్‌ సిబ్బంది... వారు సేకరించిన చెత్తను మాత్రం మరో జిల్లాలోని మున్సిపల్‌ పరిధిలో అది కూడా ఆలయానికి చెందిన భూమిలో డంపింగ్‌ చేసిన సంఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది.

సంగారెడ్డి చెత్త.. నర్సాపూర్‌లో డంప్‌
సంగారెడ్డిలోని చెత్తను నర్సాపూర్‌లో హైవే పక్కన పెద్దఎత్తున డంప్‌ చేసిన దృశ్యం

జాతీయ రహదారిపైనే చెత్త పారబోత

పక్కనే గిరిజన గురుకుల విద్యాలయం

దుర్గంధంతో ఇబ్బందిపడ్డ విద్యార్థులు

నర్సాపూర్‌, ఆగస్టు 21: ఓ వైపు ప్రజలకు పరిశుభ్రత   పాటించాలని, అనారోగ్యం గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేసే మున్సిపల్‌ సిబ్బంది... వారు సేకరించిన చెత్తను మాత్రం మరో జిల్లాలోని మున్సిపల్‌ పరిధిలో అది కూడా ఆలయానికి చెందిన భూమిలో డంపింగ్‌ చేసిన సంఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన నర్సాపూర్‌ పట్టణ పరిధిలో లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి చెందిన విలువైన భూమి ఉంది. అక్కడ నర్సాపూర్‌ మున్సిపల్‌ వారే పట్టణంలో సేకరించిన చెత్తను వేయడంపై స్థానికంగా కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. అటువంటిది ఏకంగా పక్క జిల్లా అయిన సంగారెడ్డి మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను శనివారం అర్ధరాత్రి అక్కడ డంప్‌ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పైగా రోడ్డుకు అతీ సమీపంలోనే చెత్తను వేయడం వల్ల రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు ఆదివారం తీవ్ర దుర్గంధంతో ఇబ్బందిపడ్డారు.  అర్ధరాత్రి వాహనాల్లో పెద్ద ఎత్తున సంగారెడ్డి మున్సిపల్‌ చెత్తను తీసుకురావడంతో జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ చెత్త పడడంతో రోడ్డు దారుణంగా తయారైంది. 




నర్సాపూర్‌లోని చెత్తను ఆలయ భూమిలో వేయడాన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు

నర్సాపూర్‌ మున్సిపాలిటీకి నాలుగు ఇంతలు ఎక్కువ వచ్చే సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన చెత్తను ఆలయ భూమిలో వేయడానికి నర్సాపూర్‌ మున్సిపల్‌ అధికారులు అనుమతులివ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నర్సాపూర్‌లో సేకరిస్తున్న చెత్తనే ఆ భూమిలో వేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తుండగా, వేరే జిల్లాకు చెందిన చెత్తను ఇక్కడ వేయడానికి అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ చెత్తను వేసిన సమీపంలోనే గిరిజన గురుకుల విద్యాలయం ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సంగారెడ్డిలో వ్యతిరేకించడంతో నర్సాపూర్‌లో చెత్త పారబోత

సంగారెడ్డి జిల్లాలో ఎక్కడా కూడా ఆయా ప్రాంతాల వారు సంగారెడ్డి మున్సిపల్‌ చెత్తను వేయడానికి అక్కడి వారు అనుమతి ఇవ్వకపోవడంతో జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న నర్సాపూర్‌లో ఓ ఆలయ భూమికి చెందిన స్థలంలో వేయడానికి ఇక్కడి అధికారులు అనుమతి ఇవ్వడం విచిత్రం. సొంత జిల్లాలో ఎక్కడా అనుమతి ఇవ్వని పరిస్థితిలో నర్సాపూర్‌ అధికారులు అత్యుత్సాహంతో చెత్తను వేయడానికి అనుమతి ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క రోజు కోసం అనుమతిచ్చాం

సంగారెడ్డి పట్టణంలో డంపింగ్‌ యార్డు సమస్య వచ్చినందున ఒక్క రోజుకు చెందిన చెత్తను మాత్రమే నర్సాపూర్‌ సమీపంలో వేయడానికి సంగారెడ్డి కమిషనర్‌ చంద్రశేఖర్‌ అనుమతి కోరారు. దీంతో ఒక్కరోజే కదా అని అనుమతిచ్చాం. అయినా రోడ్డు పక్కన వేయకుండా లోనికి వేయాలని సూచించాం. కానీ సరంగారెడ్డి మున్సిపల్‌ వారు అర్ధరాత్రి సమయంలో వచ్చి చెత్తను రోడ్డు పక్కనే వేశారు.

-చాముండేశ్వరి, మున్సిపల్‌ కమిషనర్‌, నర్సాపూర్‌


Updated Date - 2022-08-21T05:30:00+05:30 IST