పేకాట ఘర్షణలో ఒకరి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-11-24T23:27:19+05:30 IST

మద్యం మత్తులో పేకాటలో ముదిరిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో చోటుచేసుకున్నది.

పేకాట ఘర్షణలో ఒకరి దారుణ హత్య
నాగరాజు మృతదేహం

దుబ్బాక, నవంబరు 24: మద్యం మత్తులో పేకాటలో ముదిరిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో చోటుచేసుకున్నది. గురువారం దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జోరబొంతుల నాగరాజు(36) కూలీ పని చేస్తుంటాడు. బుఽధవారం సాయంత్రం ఇంటి నుంచి బైక్‌పై గ్రామంలోని పల్లె ప్రకృతివనం వద్దకు చేరుకున్నారు. అక్కడ దానబోయిన రామచంద్రం అలియాస్‌ స్వామి, గడ్డం శ్రీను, నిరటీ బాలయ్య పేకాట ఆడుతున్నారు. వీరితో నాగరాజు జత కలిశాడు. అప్పటికే వీరంతా మద్యం సేవించారు. కొంతసమయం తర్వాత నిరటీ బాలయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా పేకాట ఆడుతున్న మిగతా ముగ్గురి మధ్య వివాదం తలెత్తడంతో రామచంద్రం పక్కనున్న కర్రతో నాగరాజు తలపై కొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రామచంద్రం అక్కడి నుంచి పారిపోయాడు. గడ్డం శ్రీను జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలిపి అతను కూడా పారిపోయాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. భార్య బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు సంఘటనా స్థలాన్ని ఏసీపీ దేవారెడ్డి పరిశీలించారు. నాగరాజు హత్యచేసిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

Updated Date - 2022-11-24T23:27:19+05:30 IST

Read more