పల్లెల్లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులు

ABN , First Publish Date - 2022-02-20T04:25:18+05:30 IST

జిల్లాలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులు చేపడుతున్నారు.

పల్లెల్లో రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌/తూప్రాన్‌, ఫిబ్రవరి 19: జిల్లాలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వే పనులు చేపడుతున్నారు. మొన్నటి వరకు ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ హద్దురాయి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోడ్డు నక్షాను తయారు చేసేందుకు సర్వేను నిర్వహిస్తున్నారు. శనివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వే చేపట్టారు. మండలంలోని నాగులపల్లి వద్ద వాటర్‌ ట్యాంకుపై సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి 4 కిలోమీటర్ల పరిధిలో సర్వేను కొనసాగించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఢిజైన్‌ రూపొందించిన కేఎన్‌జే ప్రతినిధులు రెండు బృందాలుగా ఎదురెదురుగా సర్వేను చేశారు. గతంలో జీపీఎ్‌సకు అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. సర్వేలో భూమి లెవలింగ్‌ తీరు, ఆ ప్రాంతంలో ఉన్న కట్టడాలు, బోరుబావులు, చెట్లు, వ్యవసాయ భూములు, రోడ్లు, కాలువలు, ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్లోని నిర్మాణాలు తదితర ఆంశాలను నమోదు చేస్తున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డును 100 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసేందుకు మార్కింగ్‌ చేస్తున్నారు. ఐదు కిలోమీటర్ల మేరకు వేసిన హద్దు రాళ్ల పరిధిలో రోజూ సర్వే నిర్వహిస్తున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు డిజైన్‌ చేసినట్లుగా సర్వే రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెబుతున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు 100 మీటర్ల మేరకు భూసేకరణ చేస్తున్నారు. ప్రధాన రహదారులకు అనుసంధానమయ్యే పెద్దాపూర్‌, శివ్వంపేట, రెడ్డిపల్లి, నాగులపల్లి–ఇస్లాంపూర్‌, ప్రెజ్ఞాపూర్‌, భువనగిరి వద్ద రింగ్‌ రోడ్డు చౌరస్తాలు వస్తుండటంతో 300 మీటర్లకు భూసేకరణ చేసేందుకు డిజైన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సర్వే పనులు భువనగరి వరకు పూర్తిచేసి సమగ్ర నివేదిక రూపొందించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సర్వే పూర్తయ్యేందుకు నెలరోజులు పట్టే అవకాశం ఉంది.  ఇక రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు భూసేకరణ ప్రక్రియ మూడు, నాలుగు నెలల తరువాతనే జరిగే వీలున్నది. 

Read more