పేదల కాలనీలో ‘రియల్‌’ వ్యాపారం

ABN , First Publish Date - 2022-12-13T23:46:20+05:30 IST

సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో రియల్‌ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

పేదల కాలనీలో ‘రియల్‌’ వ్యాపారం

ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల విక్రయం

చౌకగా కొని అనుమతుల లేకుండా నిర్మాణాలు

దండుకుంటున్న దళారులు

కంది, డిసెంబరు 13 : సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో రియల్‌ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. 20 సంవత్సరాల క్రితం దివ్యాంగులు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిన కాలనీ ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అడ్డాగా మారింది. పేదల అవసరాలను దళారులు తమ లాభాలుగా మార్చుకుంటున్నారు. అరకొర ధరలకు స్థలాను కొనుగోలు చేసి లాభాలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. కానీ ప్రజాప్రతినిధుల అండతో కొందరు దళారులు లక్ష్మీనగర్‌ కాలనీలో స్థలాలను కొనుగోలుచేసి పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు పాత అనుమతులను రెన్యూవల్‌ చేయకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై ఆరోపణలు వస్తుండడంతో స్పందించిన ఉప సర్పంచ్‌ ఖాజా ఖురేషి, గ్రామ కార్యదర్శి విద్యాధర్‌గౌడ్‌, బిల్‌ కలెక్టర్‌ వీర్రాజు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇళ్లకు మంగళవారం నోటీసులు అంటించారు. మూడురోజుల్లో దస్తావేజులు, అనుమతి పత్రాలను పంచాయతీ కార్యలయంలో ఇవ్వాలని ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం : విద్యాదర్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి

గ్రామంలో ఇళ నిర్మాణానికి పంచాయతీ అనుమతులు తీసుకోవాల్సిందే. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడితే వారికే నష్టం. నిబంధనలు ఉల్లంఘిస్తే 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సెక్షన్‌ 113, 114 కింద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం.

Updated Date - 2022-12-13T23:46:22+05:30 IST