సిద్దిపేటలో రేడియో, కీమో థెరపీ సేవలు

ABN , First Publish Date - 2022-09-17T05:56:04+05:30 IST

కేన్సర్‌కు సంబంధించిన రోగులకు రేడియో, కీమో థెరపీ సేవలు ఉచితంగా అంందించేందుకు సిద్దిపేటలో త్వరలోనే అందుకు కావలసిన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 2018 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు నిర్వహించిన మెడ్‌ ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు.

సిద్దిపేటలో రేడియో, కీమో థెరపీ సేవలు
మెడ్‌ ఎక్స్‌పోలో స్టాల్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌రావు


రూ.15 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌ ఏర్పాటు

మెడికల్‌ కళాశాలలో 48 పీజీ సీట్లకు అనుమతి

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 22 : కేన్సర్‌కు సంబంధించిన రోగులకు రేడియో, కీమో థెరపీ సేవలు ఉచితంగా అంందించేందుకు సిద్దిపేటలో త్వరలోనే అందుకు కావలసిన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 2018 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు నిర్వహించిన మెడ్‌ ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు. కళాశాలలో వైద్య విద్యకు సంబంధించి 70 రకాల ప్రదర్శన స్టాళ్లను విద్యార్థులు ఏర్పాటు చేశారు. హరీశ్‌రావు పలు స్టాళ్లను సందర్శించారు. అనంతరం మానవ శరీరానికి సంభందించి లైవ్‌ ఆర్గాన్స్‌ను, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలో పలు అంశాలపై విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ మెడ్‌ ఎక్స్‌పోను నిర్వహించలేదని, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసి ఇతర కళాశాలలకు మార్గదర్శిగా నిలవాలన్నారు. ప్రభుత్వ, పైవ్రేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి ఒక్కరూ మెడ్‌ ఎక్స్‌పోను సందర్శించాలన్నారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ వల్లే మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు 48 పీజీ సీట్లు మంజూరయ్యాయని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 900 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే పూర్తిచేసుకుని ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. గుండె శస్త్ర చికిత్సకు సంబంధించి రూ.15 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ప్రిన్సిపాల్‌ విమలాథామస్‌, నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


వైద్యులపై ఒత్తిడి తేవద్దు

మొదటి కాన్పులో నార్మల్‌ డెలివరీకి బదులు సీజెరియన్‌ చేయాలని ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తీసుకురావద్దని గర్భిణుల బంధువులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రూ.1.80 కోట్లతో ఆధునీకరించిన అత్యవసర వైద్య చికిత్స విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ముందుగా అత్యవసర విభాగం వద్ద ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ కౌంటర్‌లో ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడాలని వారికి అర్థమయ్యేలా ఆరోగ్యశ్రీ గురించి వివరించాలని సూచించారు. రోగుల బంధువులను పలకరించారు. మధ్యాహ్నం భోజనం సరిగా ఉండటం లేదని, రోగులు తెలపడంతో కాంట్రాక్టర్‌ వెంటనే తీసివేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. 


మహోన్నత స్థాయిలో  నిలబెట్టాం

సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు16: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నామకరణం చేసి సీఎం కేసీఆర్‌ ఆయనను మహోన్నత స్థానంలో నిలబెట్టారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహనికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళితసంఘం నాయకులు సాకి ఆనంద్‌, గ్యాదరి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


నిశ్శబ్దం వీడండి

ప్రతి ఒక్కరూ క్లాత్‌పాడ్స్‌ వాడి, పర్యావరణాన్ని కాపాడేలా నిశ్శబ్దం వీడి, బహిరంగంగా చర్చించాలని, అప్పుడే రుతుప్రేమ లక్ష్యం సిద్ధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ప్రభుత్వ మహిళ ఉపాధ్యాయులకు రుతుప్రేమ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హజరై మాట్లాడారు. రుతు చక్రం లేకపోతే జీవనమే లేదన్నారు. పది మందికి విద్యా బోధన చేసే మీరు రుతుప్రేమ పట్ల అందరిలో అవగాహన కల్పించి ఒక మార్పు, చైతన్యం తేవాలని కోరారు. మాట్లాడానికే ఇష్టపడని అంశంపై జిల్లా వ్యాప్తంగా బహిరంగ చర్చ, సదస్సులు, అవగాహన ప్రక్రియలు జరగడం మన సిద్దిపేట జిల్లా ప్రగతికి మొదటి మెట్టుగా అభివర్ణించారు. ఈ రోజు 8 వేల మహిళలకు రుతుప్రేమ ద్వారా క్లాత్‌ప్యాడ్స్‌ పంపిణీ చేయడం గొప్ప విషయమని వివరించారు. దీనిద్వారా రెండు నెలల్లో 60 టన్నుల సానిటరీ పాడ్స్‌ (హానికరమైన చెత్త)ను పరోక్షంగా దూరం చేసినట్టు ధీమాగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్‌పర్సన్‌ రోజాశర్మ, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి సరోజ, మహిళ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read more