ప్రజా సేవకులం

ABN , First Publish Date - 2022-09-30T05:12:40+05:30 IST

ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉండే ప్రజా సేవకులం మనమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ యూత్‌ కమిటీ నాయకులు, సభ్యులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రజా సేవకులం
సిద్దిపేట పట్టణంలో బస్తీ దవాఖానాను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటాం  : రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 29 : ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉండే ప్రజా సేవకులం మనమేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ యూత్‌ కమిటీ నాయకులు, సభ్యులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కార్యకర్తలే టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టుగొమ్మలని, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సీనియర్లు, జూనియర్లతో కలసికట్టుగా సమన్వయంతో వ్యవహరించాలని యువజన విభాగం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతీ సోషల్‌ మీడియా కార్యకర్త యాక్టివ్‌గా ఉండాలని, క్రియాశీలకంగా పని చేయాలని కోరారు. కేంద్రం ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నదని, రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతుందని మండిపడ్డారు. బీజేపీ సోషల్‌ మీడియా ఫేక్‌ ప్రచారాన్ని మనమంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని కోరారు. టీఆర్‌ఎస్‌ యువజన కమిటీని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డుకు చెందిన పలువురు బీజేపీ నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కెమ్మసారం నర్సింలు, శ్యామలత, ఆంజనేయులు, పవన్‌ కళ్యాణ్‌ తదితరులున్నారు. నల్గొండలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రెండు విభాగాల్లో 2 గోల్డ్‌, 2 సిల్వర్‌ పతకాలను సాధించిన విజేతలను, సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట అశోక్‌, నిమ్మ శ్రీనివా్‌సరెడ్డి, విక్రమ్‌, తోట సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో నారాయణరావుపేట మండల ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై డివిజన్‌, మండలంలోని అధికారులతో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా మంత్రి హరీశ్‌రావు చర్చించారు. గ్రామ అభివృద్ధి సంపూర్ణ బాధ్యత సర్పంచ్‌లదేనని, పెండింగులో ఉన్న పనులన్నీ అధికారుల సమన్వయంతో పూర్తి చేయించాలని మంత్రి హరీశ్‌రావు మండల నాయకులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. 


బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకోవాలి

పేద ప్రజలు బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖానాను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు పలు వార్డుల్లో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌, వార్డు కౌన్సిలర్‌ తాడూరి సాయి తదితరులు పాల్గొన్నారు.


విద్య, వైద్య రంగాల అభివృద్ధి 

సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 29 : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను అన్ని కోణాల్లో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన ఎస్టీయూ వజ్రోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన ఊరు - మన బడి కార్యక్రమానికి రూ.7,300కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించామని గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని తెలిపారు. 75 ఏళ్లలో రాష్ట్రంలో ఐదు మెడికల్‌ కళాశాలు ఉంటే ఏడేళ్లలో 17 మెడికల్‌ కళాశాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రైతు బతుకు అరిటాకు మీద ముల్లు లాంటిదని అలాంటి రైతులను కాపాడుకోవడం మన బాధ్యత అని మంత్రి తెలిపారు. ఈహెచ్‌ఎ్‌స పథకం అమలు కోసం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.


Read more