రాయపోలులో ప్రోటోకాల్‌ రగడ

ABN , First Publish Date - 2022-04-24T05:40:18+05:30 IST

రాయపోల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిలిచిపోయింది. ఓవైపు బీజేపీ నాయకుల ప్రోటోకాల్‌ రగడ మరోవైపు తమ గ్రామం పేరు లేదని రెండు గ్రామాల మధ్య గొడవ, ఇంకోవైపు కో ఆప్షన్‌ సభ్యుడి అసహనంతో శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది.

రాయపోలులో ప్రోటోకాల్‌ రగడ
శిలాఫలకాన్ని తొలగిస్తున్న దృశ్యం

నిలిచిపోయిన కేజీబీవీ భవన శంకుస్థాపన

ఎంపీ, ఎమ్మెల్యే పేర్లపైనా పంచాయితీ


రాయపోల్‌, ఏప్రిల్‌ 23 : రాయపోల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిలిచిపోయింది. ఓవైపు బీజేపీ నాయకుల ప్రోటోకాల్‌ రగడ మరోవైపు తమ గ్రామం పేరు లేదని రెండు గ్రామాల మధ్య గొడవ, ఇంకోవైపు కో ఆప్షన్‌ సభ్యుడి అసహనంతో శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది.

కస్తూర్బా విద్యాలయానికి సర్వ శిక్ష అభియాన్‌లో భాగంగా రూ.3.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ భవన నిర్మాణం కోసం అధికారులు రాయపోల్‌ మండలం కొత్తపల్లి శివారుకు సంబంధించిన అసైన్‌మెంట్‌ భూమిని నుంచి సేకరించారు. శనివారం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కోసం అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకంపైన కొత్తపల్లి, రాయపోల్‌ గ్రామాలపేర్లతో పాటు ఇరు గ్రామాల సర్పంచుల పేర్లు రాయించారు. కింద కేజీబీవీ పాఠశాల రాయపోల్‌ అని రాయించారు. దీంతో కొత్తపల్లి గ్రామస్థులు శంకుస్థాపన స్థలానికి చేరుకొని అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజీబీవీ పాఠశాల కొత్తపల్లి అని రాయించాలని పట్టుబట్టారు. ఇదిలా ఉండగా భూములు త్యాగం చేసిన వారి పేర్లు శిలాఫలకంపై ఎందుకు పెట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపోల్‌కు సంబంధించిన రైతుల నుంచి సేకరించిన భూమి కాబట్టి రాయపోల్‌ పేరే ఉంటుందని రాయపోల్‌ గ్రామస్థులు అభ్యంతరం తెలపడంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సద్దుమణగలేదు. తదనంతరం శిలాఫలకంపై తన పేరు విస్మరించారని మండల కో ఆప్షన్‌ సభ్యులు పర్వేజ్‌ అసహనం వ్యక్తంచేశారు. ఇదే కాకుండా ప్రోటోకాల్‌ ప్రకారం శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు మొదటగా రాయాల్సి ఉండగా రెండో స్థానంలో రాశారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. శిలాఫలకాన్ని తొలగించే వరకు కదిలేదని పట్టుబట్టారు. దీంతో అధికారులు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిద వేసి, శిలాఫలకాన్ని తొలగింపజేశారు.


దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 23: దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఉప్పు నిప్పుగా మారాయి. బీజేపీ తరఫున ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ ఉండడం.. ఇద్దరిదీ దుబ్బాక నియోజకవర్గమే కావడంతో ఈ గొడవలకు ఆజ్యం పోసినట్లవుతున్నది. ఇరు పార్టీల నడుమ ప్రొటోకాల్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి శిలాఫలకాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని రఘునందన్‌రావు మండిపడుతున్నారు. కాగా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ప్రాధాన్యత ఉండాలని టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. దుబ్బాక పట్టణంలో ఒకసారి, ఇటీవల తొగుట మండలం గుడికందుల, తాజాగా రాయపోల్‌ మండలాల్లో ప్రొటోకాల్‌ సమస్యపై గొడవలు రచ్చకెక్కాయి. దీంతో దుబ్బాక నియోజవకర్గంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నేతల మాట వినాలా? ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నందున ఆ పార్టీ వారి మాట వినాలా? అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. శిలాఫలకాల తయారీ, ప్రోటోకాల్‌ అంశంలో తర్జనభర్జన పడుతున్నారు.  

సీఎ్‌సను కలిసిన రఘునందన్‌

ప్రొటోకాల్‌ పాటించడంలో తనపై వివక్ష చూపిస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం రోజున సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కలిశారు. అసెంబ్లీ గైడ్‌లైన్‌ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు నియోజవర్గాల్లో ఆరుచోట్ల ఒకరకంగా, దుబ్బాకలో మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 


Read more