పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-14T04:51:28+05:30 IST

రైతులు పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మల్లయ్య అన్నారు.

పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

పలు మండలాల్లో పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 13: రైతులు పత్తి సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మల్లయ్య అన్నారు. మంగళవారం మండలంలోని అలిరాజపేట, తిగుల్‌, బస్వాపూర్‌ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పత్తి పంటలను పరిశీలించారు. అధిక వర్షాలకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, సత్తిరెడ్డి, బ్రహ్మచారి, రామచంద్రారెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు. అలాగే మర్కుక్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పంటలను మండల వ్యవసాయ అధికారి డాక్టర్‌ టీ.నాగేందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. 

చిన్నకోడూరు: మండలంలోని ఇబ్రహీంనగర్‌ గ్రామంలో రైతులు సాగుచేస్తున్న పత్తి పంటను మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి జయంత్‌కుమార్‌ పరిశీలించి మాట్లాడారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పత్తి మొక్కల వేరు వ్యవస్థ చుట్టూ నీరు చేరి, వేర్లకు గాలి అందక మొక్కలు పారావిల్ట్‌కు దారితీసే ఆవకాశం ఉన్నదని రైతులకు సూచించారు. మొక్కలకు పారావిల్ట్‌ వచ్చినచో 30 గ్రాముల కాఫర్‌ ఆక్సిక్లోరైడ్‌, 2 గ్రాముల ఫ్లాంటోమైసిన్‌ను 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్లను బాగా తడపాలన్నారు. ఏఈవో ప్రశాంత్‌ పాల్గొన్నారు.

కోహెడ: కోహెడ మండలంలోని పలు గ్రామాల్లోని పత్తి పంటలకు పారావిల్ట్‌ తెగులు సోకింది. కాగా మంగళవారం వింజపల్లి గ్రామంలో పత్తి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్‌ పరిశీలించారు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలు దెబ్బతిన్నాయని, దీంతో ఈ తెగులు వ్యాపించినట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. 

Updated Date - 2022-09-14T04:51:28+05:30 IST