వరి కోతలు.. అన్నదాత అగచాట్లు

ABN , First Publish Date - 2022-10-12T04:43:40+05:30 IST

మెదక్‌ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ధాన్యం తడిసిపోతున్నది. చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వరి కోతలు.. అన్నదాత అగచాట్లు
మెదక్‌ మండలం మంబోజిపల్లిలో రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం

పంట చేతికి వచ్చినా తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు 

వర్షాలకు తడుస్తున్న వడ్లు  

సీజన్‌ ప్రారంభంలోనే కష్టాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 11: మెదక్‌ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ధాన్యం తడిసిపోతున్నది. చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పంట కొనుగోళ్లపై గత నెల 20న అదనపు కలెక్టర్‌ రమేశ్‌ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 15 లోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అడుగు ముందుకుపడలేదు. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. 


భారీగా ధాన్యం దిగుబడి 

వర్షాలు పుష్కలంగా కురియడంతో ప్రస్తుత సీజన్‌లో రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపారు. దీంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ధాన్యం దిగుబడులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రాథమిక సహకారం సంఘాలు, ఐకేపీ, మార్కెటింగ్‌శాఖలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. 


భయపెడుతున్న వర్షం

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు వర్షం కంటి మీద కునుకు లేకుండా చేసున్నది. పంట చేతికొచ్చిందని సంబర పడుతుండగానే విడువకుండా వర్షం కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోతలు పూర్తయిన చోట్ల ధాన్యం తడిసిపోతున్నది. వేల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంట కళ్ల ఎదుట పాడవుతుంటే రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం రంగుమారకుండా ఉండడం కోసం రోడ్లపై ఆరబోస్తున్నారు. కానీ ఎప్పుడు వర్షం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయమంతా ఎండ కాసినా సాయంత్రానికి వాన కురియడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. ఆదివారం, సోమవారాల్లో కురిసిన వర్షాలకు మెదక్‌, కొల్చారం, నర్సాపూర్‌, కౌడిపల్లి మండలాల్లో వడ్లు తడిసిపోయాయి. పంటను కోయకుండా ఉందామంటే వర్షాలకు వరి నేలకొరిగి మొలకెత్తే ప్రమాదం ఉన్నది. దీంతో పంట కోసినా.. కోయకున్నా రైతుకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ధాన్యాన్ని విక్రయిస్తామని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-10-12T04:43:40+05:30 IST