మాది పేదల ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-26T05:23:44+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌ పేదల ప్రభుత్వంగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటున్న బీజేపీతో దేశ ప్రజలకు ట్రబులేనని మంత్రి హెచ్చరించారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలో పాఠశాల భవనం, డైనింగ్‌హాల్‌, బీటీరోడ్డు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, పంచాయతీ భవనం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, ఫంక్షన్‌హాల్‌, పార్కు, దుకాణ సముదాయం, కుల సంఘాల భవనాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

మాది పేదల ప్రభుత్వం

డబుల్‌ ఇంజన్‌ బీజేపీతో ట్రబులే

కాంగ్రెస్‌, బీజేపీలతో ఒరిగిందేమీ లేదు 

ఇచ్చిన హామీ మేరకు కొత్త ఆసరా పింఛన్ల అందజేత

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


నారాయణరావుపేట, ఆగస్టు 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌ పేదల ప్రభుత్వంగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటున్న బీజేపీతో దేశ ప్రజలకు ట్రబులేనని మంత్రి హెచ్చరించారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలో పాఠశాల భవనం, డైనింగ్‌హాల్‌, బీటీరోడ్డు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, పంచాయతీ భవనం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, ఫంక్షన్‌హాల్‌, పార్కు, దుకాణ సముదాయం, కుల సంఘాల భవనాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో రూ.కోటి 30 లక్షలతో డిజిటల్‌ అదనపు తరగతుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ 70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మండలంలో 569 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు అందజేయడం సంతోషకరమన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనలో రూ.200 పింఛన్‌ మాత్రమే ఉండేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.2016గా చేసిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్దఎత్తున పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్సే అన్నారు. ఇచ్చిన హామీ మేరకు నూతన పెన్షన్‌ మంజూరు చేశామని మంత్రి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిరిగా పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. సంక్షేమం కోసం అందిస్తున్న ఉచిత పథకాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని హరీశ్‌రావు ప్రశ్నించారు. 24 గంటల ఉచిత కరెంటును నిలిపివేసి, వ్యవసాయ బావుల వద్ద కరెంటు మీటర్లు పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తుందన్నారు. పెద్దపెద్ద బడాబాబుల కంపెనీలకు రూ.లక్షల కోట్ల చొప్పున అప్పులను మాఫీ చేస్తూ వారికి తొత్తుగా బీజేపీ పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో సాగునీటి కష్టాలను తీర్చేందుకు నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కళ్లల్లో సంతోషం కనబడుతుందన్నారు. గుండె ఆపరేషన్లకు సంబంధించి ఎంతో ముఖ్యమైన పరికరాలను సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో త్వరలో రూ.15 కోట్లతో సమకూర్చనున్నట్లు మంత్రి తెలియజేశారు. కేన్సర్‌ చికిత్స కోసం రేడియోథెరపి, కీమోథెరపి పరీక్షలకు సంబంధించి సిద్దిపేటలో ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదల కంటి వైద్యం కోసం ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పెద్దపెద్ద ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామన్నారు. అనంతరం నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులకు పింఛన్‌ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ వంగ నాగిరెడ్డి, ఎంపీపీ బాలకృష్ణ, సర్పంచ్‌ మాస శశియాదగిరి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారలు పాల్గొన్నారు.


సిద్దిపేటలో మరో అధునాతన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 25 : రానున్న రోజుల్లో సిద్దిపేట పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో మరో అధునాతన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని, సిద్దిపేట అభివృద్ధిలో అన్నింటిలో ఒక అడుగు ముందుగానే ఉన్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట సమీకృత మార్కెట్‌ సముదాయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబోయే మైసమ్మ ఆలయానికి చైర్‌పర్సన్‌ మచ్చ విజితారెడ్డితో కలసి శంకుస్థాపన మంత్రి చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి వచ్చి సిద్దిపేట అభివృద్ధిని చూసి వెళ్తున్నారని ఆయన తెలిపారు. పట్టణంలో నాలుగు దిక్కుల బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మూడు నెలల్లో మైసమ్మ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని పెద్దఎత్తున ప్రారంభించుకుందామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గంప రాంచందర్‌, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ సెక్రెటరీ వెంకటయ్య, మార్కెట్‌ కమిటీ అకౌంటెంట్‌ సురేష్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more