కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-05T03:56:45+05:30 IST

దుబ్బాక మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు దంపతులు హోమం నిర్వహించారు.

కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రోత్సవాలు
దుబ్బాకలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, అక్టోబరు 4: దుబ్బాక మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు దంపతులు హోమం నిర్వహించారు. దుబ్బాక రెడ్డి యువసేన ఆధ్వర్యంలో జరిగిన హోమంలో రెడ్డి సంఘం నాయకుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మండలంలోని గంభీర్‌పూర్‌ గ్రామంలోని బజరంగ్‌ సేనయూత్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. లచ్చపేట నగరేశ్వరాలయంలో చండీహోమం, అష్టదిక్పాలక బలి, పూర్ణాహుతి నిర్వహించారు. 

మిరుదొడ్డి: మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో జ్ఞానసరస్వతీదేవి అమ్మవారు రాజరాజేశ్వరదేవి రూపంలో దర్శనమిచ్చారు.  

చిన్నకోడూరు: చిన్నకోడూరులో జైభీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారిని మంగళవారం సర్పంచ్‌ ఉమే్‌షచంద్ర, ఎంపీటీసీ శారదారమేష్‌, ఉపసర్పంచ్‌ శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజలింగం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

మద్దూరు: దూళిమిట్ట మండలం జాలపల్లిలో దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం చండీహోమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీపీసీసీ ప్రతినిధి, జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు, వెంకటయ్య, గిరి గోవర్దన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. 

కొండపాక: కుకునూరుపల్లిలోని భీష్మ గంగపుత్ర యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో మంగళవారం డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా యూత్‌ క్లబ్‌ సభ్యులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఎన్‌ఆర్‌ చైర్మన్‌ నరేందర్‌, ఎంపీటీసీ భూములుగౌడ్‌ పాల్గొన్నారు. 

సిద్దిపేట కల్చరల్‌: సిద్దిపేటలోని పార్వతీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు బ్రహ్మం, పెద్ది నాగరాజు, మల్లికార్జున్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని ఆలయం తరఫున ట్రస్టు సభ్యులు శాలువాలతో సత్కరించారు. 

గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ పట్టణంలోని మహాకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం మహిషాసుర మర్ధిని ఆకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. 

చేర్యాల: దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని చేర్యాలలో చావడి వద్ద ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం అధ్యక్షుడు సంపత్‌ ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. అలాగే దేవీస్నేహాయూత్‌ నిర్వాహకులు సుహాసినీ, కన్య పూజ నిర్వహించారు. 

బెజ్జంకి: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌ గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత మండపంలో మహిళలు మంగళవారం కుంకుమార్చనలు నిర్వహించారు. 

Read more