అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2022-12-09T23:59:18+05:30 IST

సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చందన

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ చందనాప్రశాంత్‌రెడ్డి

పాపన్నపేట, డిసెంబరు 9: అధికారులు స్థానికంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎంపీపీ చందనాప్రశాంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ అధికారులు కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. పాపన్నపేటలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సమస్యలపై ప్రస్తావించారు. గతంలో పని చేసిన తహసీల్దార్‌ మహేందర్‌గౌడ్‌ భూ సమస్యల విషయంలో అర్జీదారులను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. విద్యుత్‌ అధికారులు గ్రామాల్లో సమస్యలను పట్టించుకోకపోగా.. కనీసం ఫోన్లు సైతం లేపడం లేదని డాక్యా తండా సర్పంచ్‌ హీరలాల్‌, ఎంకేపల్లి సర్పంచ్‌ మల్లేశం నిలదీశారు. పంచాయతీల తరఫున తాము నెల నెలా బిల్లు చెల్లిస్తున్నా స్తంభాలు వేయడం లేదని, విద్యుత్‌ తీగలు లాగడం లేదని ఆరేపల్లి సర్పంచ్‌ శ్రీనాథ్‌రావు అన్నారు. ఎంపీపీ జోక్యం చేసుకుని ఇకముందు అలా జరగకుండా చూడాలని ఏఈని ఆదేశించారు. నీటి పారుదల ఏఈ మాట్లాడుతూ.. మండలంలో 25మిషన్‌ కాకతీయ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, సర్పంచులు వెంటనే చేయాలని సూచించారు. వనదుర్గా ప్రాజెక్టు షట్టర్ల పనులు కొనసాగుతున్నాయని, 15రోజుల్లో పూర్తి చేస్తామని ఏఈ విజయ్‌ వెల్లడించారు. రైతులు ఎప్పటిలాగే పంటలు వేసుకోవాలని, సాగునీరుకై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పనుల బిల్లులు సరిగా రావడం లేదని, త్వరగా వచ్చేలా చూడాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. శ్రీనిధికి సంబంధించిన డబ్బుల విషయంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల వద్ద సీఏలు అధికంగా వసూలు చేయకుండా చూడాలని కోరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మూడు సెక్టార్లకు సూపర్‌వైజర్ల నియమాకం జరిగిందని, వారు ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారని, త్వరలో విధుల్లో చేరనున్నారని ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్లేశం, కో ఆప్షన్‌ సభ్యులు గౌస్‌ పాషా, సర్పంచులు గురుమూర్తిగౌడ్‌, అనురాధఏడుకొండలు, బాపిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:59:19+05:30 IST