వైద్యశాఖలో 2,600 ఉద్యోగాలకు వారంలో నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-06-08T05:00:53+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖలో వారం రోజుల్లో 2,600 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు.

వైద్యశాఖలో 2,600 ఉద్యోగాలకు వారంలో నోటిఫికేషన్‌
అక్కన్నపేట మండలం రామవరంలో పీహెచ్‌సీని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

 నార్మల్‌ డెలివరీలు చేయిస్తే రూ.3 వేల పారితోషికం

 ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


అక్కన్నపేట, జూన్‌ 7: వైద్య ఆరోగ్య శాఖలో వారం రోజుల్లో 2,600 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో గ్రామాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలపై  సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తేడా ఏమిటో గర్భిణులకు, వారి తల్లిదండ్రులకు, భర్తలకు తెలపాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాలో ప్రసవాలు పెరగాలని, నార్మల్‌ డెలివరీలు చేయిస్తే ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఏం, స్టాఫ్‌ నర్సులు, వైద్యులకు రూ.3వేల పారితోషికం అందిస్తామని ప్రకటించారు. గ్రామాల్లో ప్రతీ మనిషికి బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి ప్రభుత్వం ఇచ్చిన ఎన్సీడీ కిట్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. అక్కన్నపేట పీహెచ్‌సీలో మూడు నెలలకు సరిపడేలా మందులు తెప్పించి పెట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌కు సూచించారు. అక్కన్నపేట మండలంలో క్యాంపు నిర్వహించి పైసా ఖర్చు లేకుండా క్యాటారాక్ట్‌ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని, అలాగే రూ.3లక్షల ఖర్చుతో మోకాలి చిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామని తెలిపారు. అక్కన్నపేట, రామవరం పీహెచ్‌సీలకు ప్రహరీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రామవరం-తోర్నాల రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు, సర్పంచ్‌ వనపర్తి స్వప్ననరేష్‌, ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

Read more