‘నూతన’ యాతన

ABN , First Publish Date - 2022-11-24T23:52:17+05:30 IST

ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టుంది జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి.

‘నూతన’ యాతన

కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో కార్యాలయాలకు భవనాలు, సిబ్బంది లేక ఇబ్బందులు

గెస్ట్‌హౌస్‌లో జోగిపేట ఆర్డీవో ఆఫీసు, శిథిల భవనంలో ఖేడ్‌ డివిజన్‌ కార్యాలయం

కొత్త మండలల్లోనూ కార్యాలయాలకు భవనాలు కరువు

డిప్యూటేషన్‌పై సిబ్బంది సర్దుబాటు

అరకొర సిబ్బంది, వసతుల లేమితో గాడి తప్పిన పాలన

జోగిపేట, అక్టోబరు 24: ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టుంది జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 రెవెన్యూ డివిజన్లు, 5 మండలాల్లోని పరిస్థితులే ఇందుకు నిదర్శనం. కొత్త డివిజన్లు, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లాలో ఆరేళ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌, నాగల్‌గిద్ద, సిర్గాపూర్‌, వట్‌పల్లి మండలాలు, రెండున్నరేళ్ల క్రితం అందోలు-జోగిపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటయ్యాయి. ఇటీవల చౌటకూరు, నిజాంపేట మండలాలను ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన భవనాలు, సరిపడా సిబ్బందిని సమకూర్చలేదు. నారాయణఖేడ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని ఖేడ్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఓ పక్కగా ఉన్న గదుల్లో ఏర్పాటు చేశారు. ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆర్డీవో ఆఫీసును, తహసీల్దారు కార్యాలయాలను పట్టణం బయట ఉన్న గురుకుల విద్యాలయ భవనంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సిర్గాపూర్‌లో ఎమ్మార్సీ భవనంలో ఎంపీడీవో కార్యాలయం, పురాతన అద్దె భవనంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నాగల్‌గిద్దలో పాత పాఠశాల భవనానికి మరమ్మతులు చేసి అందులోనే తహసీల్‌, ఐకేపీ, వ్యవసాయాధికారి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఎమ్మార్సీ భవనంలో ఎంపీడీవో ఆఫీసు, పోలీ్‌సస్టేషన్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.

అందోలు-జోగిపేట డివిజన్‌కు రెండున్నరేళ్లు

అందోలు-జోగిపేట రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఏర్పడి రెడున్నరేళ్లు అవుతున్నది. ఆర్డీవో కార్యాలయాన్ని ఇరిగేషన్‌ శాఖ విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేశారు. ఒక గదిలో ఆర్డీవో ఛాంబర్‌, మరో గదిలో సిబ్బంది కోసం ఏర్పాట్లు చేశారు. కానీ డివిజన్‌కు సరిపడా సిబ్బందిని మాత్రం కేటాయించలేదు. వివిధ మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్‌పై కొత్త డివిజన్‌కు పంపారు. ఆర్డీవో కూడా ఇన్‌చార్జి అధికారే. ఆర్డీవో ఆఫీసులో స్థలం సరిపోక సిబ్బంది, మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఇదే డివిజన్‌ పరిధిలో కొత్తగా ఏర్పడిన వట్‌పల్లి, చౌటకూర్‌ మండలాల్లోనూ ఇవే సమస్యలు ఉన్నాయి. వట్‌పల్లి మండలంలో వ్యవసాయ మార్కెట్‌ మార్కెట్‌ పరిధిలోని కార్యాలయాల్లో తహసీల్దార్‌ ఆఫీసు, పోలీ్‌సస్టేషన్‌ కొనసాగిస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని అద్దె భవనంలోని మొదటి అంతస్థులో ఏర్పాటు చేశారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మొదటి అంతస్థుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనానికి ఒక సంవత్సరం కిరాయి మాత్రమే ఇచ్చిన అధికారులు, రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా చెల్లించ లేదు. చౌటకూర్‌ మండలం పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నది. ఇక్కడ తహసీల్దార్‌ కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేసిన అధికారులు.. పోలీ్‌సస్టేషన్‌, ఎంపీడీవో ఆఫీసులను ఏర్పాటు చేయలేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పోలీ్‌సస్టేషన్‌, ఎంపీడీవో కార్యాలయాల్ని మాత్రం ఉమ్మడి మండల కేంద్రమైన పుల్కల్‌లోనే కొనసాగిస్తున్నారు. సిబ్బందిని కూడా డిప్యూటేషన్‌పైనే నియమించారు.

గాడి తప్పిన పాలన

ఆర్డీవో కార్యాలయాల్లో కానీ.. మండల కార్యాలయాల్లో కానీ సిబ్బందిని కేటాయించకపోవడంతో పాలన కుంటుపడుతున్నది. సర్దుబాటు కారణంగా అటు ఆయా మండలాల్లో.. ఇటు ఆర్డీవో కార్యాలయంలో సిబ్బంది సరిపోక పాలన సజావుగా సాగడం లేదు. ఇన్‌ఛార్జిలుగా ఉన్న అధికారులు రెండుచోట్ల న్యాయం చేయలేకపోతున్నారు. నారాయణఖేడ్‌ ఆర్డీవోగా పనిచేస్తున్న అంబదాస్‌ రాజేశ్వర్‌రావుకే అందోలు-జోగిపేట ఆర్డీవోగానూ అదనపు బాధ్యతలు అప్పగించడంతో అటూ.. ఇటూ తిరగలేక ఆయన సతమతమవుతున్నారు. అలాగే, అసౌకర్యాల మధ్య పనిచేయలేక సిబ్బంది సతమతమవుతున్నారు. తాత్కాలిక సిబ్బందిని సర్దుబాటు చేసిన జిల్లా పాలనా యంత్రాంగం చేతులు దులుపుకున్నది. ప్రజలకు అవసరమైన కార్యాలయాలకు భవనాలను నిర్మించాలన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు మరిచిపోయారు.

Updated Date - 2022-11-24T23:55:00+05:30 IST

Read more