చేప పిల్లల పంపిణీలో జాప్యం

ABN , First Publish Date - 2022-08-10T06:16:52+05:30 IST

మెదక్‌ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండి జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలలో సరిపడా నీటి నిల్వ చేరాయి. చేపల పెంపకానికి అనువుగా ఉంది. ఇప్పటికే మత్స్య సహకార సంఘాలు చేపల పెంపకం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.

చేప పిల్లల పంపిణీలో జాప్యం

నిండిన చెరువులు, ప్రాజెక్టులు

ఇప్పటికీ మొదలుకాని సీడ్‌ పంపిణీ

మించిపోతున్న సమయం 

మెదక్‌ జిల్లాలో 1,601 చెరువులు

5.04 కోట్ల చేప పిల్లలు వదలడమే లక్ష్యం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఆగస్టు 9: మెదక్‌ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండి జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలలో సరిపడా నీటి నిల్వ చేరాయి. చేపల పెంపకానికి అనువుగా ఉంది. ఇప్పటికే మత్స్య సహకార సంఘాలు చేపల పెంపకం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. 


2 రిజర్వాయర్లు, 1,601 చెరువులు

జిల్లాలోని పోచారం, ఘనపూర్‌ రిజర్వాయర్లతో పాటు 1,601 చెరువుల్లో చేపలను పెంచుతారు. మొత్తం 241 మత్స్య సహకార సంఘాలు, 21 మహిళా మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఆయా సంఘాల్లో 15,724 మంది సభ్యులున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో జిల్లా పరిధిలోని రెండు రిజర్వాయర్లు, చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. ఉచిత చేప పిల్లల పథకంలో భాగంగా ఈ సీజన్‌లో జిల్లాలోని ఆయా వనరుల్లో 5.04 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. మెదక్‌ ఫిష్‌ఫామ్‌లో 50 లక్షల విత్తన చేప పిల్లలు ఉత్పత్తి చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. మిగిలిన చేప విత్తనాల సరఫరా కోసం టెండర్లు నిర్వహించారు. 


అదను దాటుతున్నది

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద జిల్లాలో సుమారు 5.04 కోట్ల చేప పిల్లలను సరఫరా చేయాలని మత్స్యశాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. అవసరమైనంత నీటి నిల్వ అందుబాటులోకి రావడంతో అన్ని వనరుల్లో చేపల పెంపకానికి అనుకూల వాతావరణం ఉంది. దీంతో ఈ సీజన్‌ చేపల పెంపకం ద్వారా మెరుగైన ఉపాధి లభిస్తుందని మత్స్య కారులు ఆశిస్తున్నారు. ఈ మేరకు చేపల పెంపకానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ అనువైన కాలం దాటిపోతున్నా ఇంతవరకు చేప పిల్లల (సీడ్‌) పంపిణీ మొదలుకాలేదు. దీంతో చేపల పెంపకంపై ఆధారపడి బతికే వేలాదిమంది మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా పిల్లలను వదలడం వల్ల పూర్తిస్థాయిలో పెరగవని వాపోతున్నారు. ఫలితంగా మత్స్య సంపదపై ఆధారపడిన తాము నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు మాత్రం టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మత్స్య సహకార సంఘాలకు ఉచిత చేప విత్తనం పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొంటున్నారు.

Read more