మూడు కాలేజీల్లో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2022-11-30T00:18:44+05:30 IST

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేటితో ముగియనుంది. వ్యాపార సముదాయాల్లో (మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) కొనసాగుతున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలల గుర్తింపుపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

మూడు కాలేజీల్లో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

ఇంకా గుర్తింపు పొందని కాలేజీలు

నేటితో ముగియనున్న ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 29: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేటితో ముగియనుంది. వ్యాపార సముదాయాల్లో (మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ) కొనసాగుతున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలల గుర్తింపుపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 65 కళాశాలలుండగా వీటిలో తూప్రాన్‌ శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, చేగుంట సహస్ర ఒకేషనల్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాలేదు. వార్షిక ఫీజు గడువు బుధవారంతో ముగుస్తుండడంతో ఆయా కళాశాలల్లో చదువుతున్న దాదాపు 600 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

గుర్తింపు రాకముందే ప్రవేశాలు

జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు ఈ విద్యా సంవత్సరం గుర్తింపు రాకముందే ప్రవేశాలను పూర్తిచేసి తరగతులను నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు కాలేజ్‌లు కొనసాగుతున్న భవనాల్లో ఇతర కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు ఉండడంతో అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌వోసీ) తీసుకోవాలి. ఎన్‌వోసీ సమర్పించకపోవడంతోపాటు వివిధ కారణాలతో రెండు కళాశాలలకు అనుమతి లభించలేదు. దాంతో ఈ కాలేజీల్లో చదివే ప్రథమ సంవ్సతర విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు అకాశం ఉండదు. ఒకవేళ రాయాలనుకుంటే వీరిని ప్రైవేటువారిగా పరిగణిస్తారు. ఇదే జరిగితే ఆయా విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్‌, ఇతర ప్రవేశ పరీక్షలకు వారిని అనుమతించరు. ఇటివల ఇంటర్‌ ప్రవేశాలకు గడువు ఈ నెల 27వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ గడువు కూడా ఆదివారంతో ముగిసింది. వార్షిక పరీక్షల ఫీజు గడువు నేటితో ముగుస్తున్నప్పటికీ గుర్తింపు ప్రక్రియ కొలిక్కిరాలేదు.

రెండు కళాశాలలకు గుర్తింపు రాలేదు : సత్యనారాయణ, మెదక్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి

మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కారణంగా తూప్రాన్‌, చేగుంట జూనియర్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఈ కళాశాలలు ప్రవేశాలు చేపట్టవదని సూచించాం. ఈ ఏడాది అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ, ఇతర నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

జహీరాబాద్‌ ‘అభ్యాస్‌’ కాలేజీకి అనుబంధ గుర్తింపు లేదు

-జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి గోవిందరామ్‌

సంగారెడ్డి అర్బన్‌, నవంబరు 29 : జహీరాబాద్‌లోని అభ్యాస్‌ జూనియర్‌ కాలేజీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్‌) లేదని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి గోవిందరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో మూడు సార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. ఆ కాలేజీలో చేరిన మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వెంటనే ఇతర కాలేజీల్లో అడ్మిషన్‌ పొందాలని, అందుకు నేడే ఆఖరు రోజు అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని, ఆ తర్వాత జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని తెలిపారు.

Updated Date - 2022-11-30T00:18:44+05:30 IST

Read more