మెడికల్‌ కాలేజీ అనుమతి కోసం ఎన్‌ఎంసీ వర్చువల్‌ తనిఖీ

ABN , First Publish Date - 2022-07-06T05:04:02+05:30 IST

సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచి మొదటి విద్యాసంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి పొందాలంటే (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) ఎన్‌ఎంసీ అనుమతి తప్పనిసరి.

మెడికల్‌ కాలేజీ అనుమతి కోసం ఎన్‌ఎంసీ వర్చువల్‌ తనిఖీ

అనుమతిపై త్వరలో స్పష్టత!

సంగారెడ్డి అర్బన్‌, జూలై 5:  సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఈ ఏడాది నుంచి మొదటి విద్యాసంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి పొందాలంటే (నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌) ఎన్‌ఎంసీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ ప్రతినిధులు మంగళవారం వర్చువల్‌  వేదికగా రెండో విడత ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సినవాటిపై ఆరా తీశారు. కళాశాల నిర్వహణ, ఆస్పత్రిలో సేవలందించేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర మౌళిక వసతులు, పరికరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా కళాశాల భవన నిర్మాణం, పనుల్లో పురోగతిపై ఆరా తీశారు. కాగా గత ఫిబ్రవరి 9న మొదటి విడత ఎన్‌ఎంసీ బృందం ప్రత్యక్షంగా తనిఖీలకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు గుర్తించిన లోపాలను ప్రస్తుతం సరిదిద్దుకున్నారా.. లేదా? అని అడిగి తెలుసుకున్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలో ఫ్యాకల్టీ, సీనియర్‌ రెసిడెంట్లు, ఇతర స్టాఫ్‌ కొరత తక్కువగా ఉండటమే కాకుండా, కళాశాల భవనం ఇంకా పూర్తి కాలేదని గుర్తించిన ఎన్‌ఎంసీ బృందం వచ్చే తనిఖీల సమయానికల్లా వాటిని సరిదిద్దు కోవాలని నివేదించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ లోపాలు సరిదిద్దుకున్నారా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా వర్చువల్‌  వేదికగా తెలుసుకున్నారు. ఎన్‌ఎంసీ ఇన్‌స్పెక్షన్‌ పూర్తయిన నేపథ్యంలో మెడికల్‌ కాలేజీ నిర్వహణ కోసం అనుమతిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-07-06T05:04:02+05:30 IST