అసైన్డ్‌ భూములపై టీఎ్‌సఐఐసీ కన్ను

ABN , First Publish Date - 2022-03-23T05:36:21+05:30 IST

హైదరాబాద్‌ నగరానికి చుట్టూరా ఉన్న అసైన్డ్‌ భూములపై తెలంగాణ రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ (టీఎ్‌సఐఐసీ) కన్నేసింది.

అసైన్డ్‌ భూములపై టీఎ్‌సఐఐసీ కన్ను
టీఎ్‌సఐఐసీ సేకరించనున్న అసైన్డ్‌ భూములు

50 ఎకరాలుంటే భూములను లాక్కునే యత్నం!!

రైతులకు తక్కువ   మొత్తంలో చెల్లింపులు

పారిశ్రామికవేత్తలకు భారీ ధరలకు విక్రయం

జీవనోపాధి కోల్పోతున్న రైతులు


 తూప్రాన్‌, మార్చి 22:  హైదరాబాద్‌ నగరానికి చుట్టూరా ఉన్న అసైన్డ్‌ భూములపై తెలంగాణ రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ (టీఎ్‌సఐఐసీ) కన్నేసింది. ఒకేచోట 50 ఎకరాల అసైన్డ్‌ భూములుంటే పరిశ్రమల స్థాపనకు ఆ భూములను సేకరిస్తున్నారు.  అసైన్డ్‌దారులైన రైతులకు చిన్నమొత్తంలో చెల్లింపులు చేసి, పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు భారీ ధరలకు విక్రయిస్తున్నారు. అసైన్డ్‌భూముల్లో పరిశ్రమల స్థాపనతో ఉపాధి పొందే మాట దేవుడెరుగు.. కానీ పరిశ్రమల కోసం భూసేకరణ చేయడంతో సాగు చేసుకుంటున్న పేద రైతులు జీవనోపాధి కోల్పోతున్నారు. 

మెదక్‌ జిల్లాకు సరిహద్దుగా ఉన్న కాళ్లకల్‌లో అర్ధశతాబ్ధం క్రితం పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలానికి కాలుష్యం పెరిగిపోయింది. అప్పటి పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడడంతో పరిశ్రమల స్థలాలు వెంచర్లుగా మారిపోతున్నాయి. 2006లో ముప్పిరెడ్డిపల్లిలోని సర్వే నంబర్లు 342, 354, కాళ్లకల్‌లోని సర్వేనంబరు 142లో గల 800.19 ఎకరాల భూమిని సుమారు 436 మంది రైతుల నుంచి పరిశ్రమల స్థాపన కోసం అప్పటి ‘ఏపీఐఐసీ’ సేకరించింది. ‘ఎంఎల్‌ఆర్‌’ కార్ల ఉత్పత్తి లక్ష్యంగా 750 ఎకరాల భూమిని ఆటోమోటీవ్‌ పార్కు ఏర్పాటు చేశారు. 50.19 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు నిల్వ చేశారు. కార్ల ఉత్పత్తి చేసే కంపెనీ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. పరిశ్రమల స్థాపన సమయంలో ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం అంటు ప్రకటించారు. పరిశ్రమల స్థాపన జరిగిపోయినప్పటికీ ఇంటికో ఉద్యోగం రాలేదు, ఇంటి స్థలం కాగితాల్లోనే ఉండిపోయింది. కారు ఉత్పత్తి చేయకపోవడంతో ఆటోమోటీవ్‌పార్కును ఇండస్ట్రీయల్‌ పార్కుగా మార్చేశారు. ఈ భూసేకరణ జరుగుతున్న సమయంలోనే పక్కనే ఉన్న కూచారంలో సర్వేనంబరు 228లో 82.20 ఎకరాల భూమిని 83 మంది అసైన్డ్‌దారుల నుంచి సేకరించి, పరిశ్రమల స్థాపన చేపట్టారు. దశాబ్దంన్నర తర్వాత మళ్లీ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనపై దృష్టి కేంద్రీకరించడంతో అధికారులు అసైన్డ్‌ భూములపై దృష్టి పెట్టారు. ఇటీవలే కొండాపూర్‌లోని సర్వేనంబరు 129, 132లోని 191.16 ఎకరాల భూమిని టీఎ్‌సఐఐసీ సేకరించింది. కోటి రూపాయలకుపైగా ధర పలుకుతున్న ఈ ప్రాంతంలో ఎకరాకు రూ. 10.50 లక్షలు చెల్లించారు. కొండాపూర్‌లో పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తకు ఎకరం రూ.కోటిన్నరకు అమ్మినట్లు సమాచారం. 

ప్రస్తుతం హైవే 44 మీదున్న తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంట మండలాలలోని అసైన్డ్‌భూములపై టీఎ్‌సఐఐసీ దృష్టి కేంద్రీకరించింది. మనోహరాబాద్‌ మండలం పోతారంలోని సర్వేనంబరు 30, 56 టు 63, 112లోగల 229 ఎకరాలను టీఎ్‌సఐఐసీ భూసేకరణ చేస్తుంది. రంగాయపల్లిలో సర్వేనంబరు 65 టు 99లోగల 46.32 ఎకరాల భూమిని టీఎ్‌సఐఐసీ సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల పరికిబండలో మిగులు భూమి (సర్వేనంబరులేని) 115.14 ఎకరాలను సైతం పరిశ్రమల స్థాపనకు కేటాయించేందుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. తూప్రాన్‌ మండలంలో ఘనపూర్‌ శివారులోని సర్వే నంబరు 393, 441లోని 307.36 ఎకరాల భూమిని టీఎ్‌సఐఐసీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీఎ్‌సఐఐసీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా సర్వేలు కూడా చేపట్టాయి. ప్రస్తుతం కాస్తుదారులను గుర్తించే పనులు జరుగుతున్నాయి. ఇమాంపూర్‌ శివారులో సర్వేనంబరు 100, 161లతోపాటు మరికొన్ని సర్వేనంబర్లలో ఉన్న సుమారు 250 ఎకరాల అసైన్డ్‌ భూమిని టీఎ్‌సఐఐసీ గతేడాది సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అసైన్డ్‌ రైతులు రాజకీయ నాయకులను ఆశ్రయించడం, భూసేకరణ చేయవద్దంటూ అడ్డుకోవడంతో కొద్దిరోజులుగా సర్వే నిలిచిపోయింది. అయినప్పటికీ ఆ భూమిని టీఎ్‌సఐఐసీ తీసుకోడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. చేగుంట మండలం వడియారంలో సర్వేనంబరు 307లో పరిశ్రమల స్థాపనకు కొంత భూసేకరణ చేశారు. మళ్లీ అదే సర్వేనంబరులోగల మిగులు భూమిని సేకరించేందుకు టీఎ్‌సఐఐసీ మళ్లీ ప్రయత్నాలు చేపట్టింది.

హైవే 44  పొడవునా..

మెదక్‌ జిల్లాలో హైవే 44 పొడవునా ఉన్న తూప్రాన్‌ డివిజన్‌లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూనుకున్నది. డివిజన్‌ పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూముల సేకరణ చేసి పరిశ్రమల స్థాపన చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో మేడ్చల్‌ జిల్లా (పాత రంగారెడ్డి జిల్లా) సమీపంలో ఉన్న  మనోహరాబాద్‌ మండలంలో కాళ్లకల్‌ ప్రాంతంలోనే భూసేకరణ చేశారు. ప్రస్తుతం మనోహరాబాద్‌ మండలంలో 50 ఎకరాలమేర అసైన్డ్‌ భూములను టీఎ్‌సఐఐసీ సేకరించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. మనోహరాబాద్‌ మండలంలో అసైన్డ్‌ భూములు పూర్తవ్వడంతో తూప్రాన్‌ మండలంలో భూసేకరణ మొదలెట్టారు. తూప్రాన్‌ మండలంలో భూసేకరణ పూర్తవుతుండటంతో ప్రస్తుతం మళ్లీ చేగుంట ప్రాంతంలో భూసేకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది.  పరిశ్రమల స్థాపనకు భూసేకరణ చేస్తుండటంతో అసైన్డ్‌దారులు జీవనోపాధిని కోల్పోతున్నట్లు చెబుతున్నారు. భూములు లాక్కొని డబ్బులిస్తే ఖర్చయిపోతున్నాయని వ్యవసాయం చేసుకొని జీవించే తమకు ఉపాధిలేకుండా పోతుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టీఎ్‌సఐఐసీని ఓ వ్యాపార సంస్థగా మార్చేశారు 

- ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డి,  కాంగ్రె్‌స పార్టీ మండల అధ్యక్షుడు  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపన పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కుంటుంది. టీఎ్‌సఐఐసీని ఓ వ్యాపార సంస్థగా మార్చేశారు. పరిశ్రమల స్థాపన పేరుతో వ్యాపారం చేస్తూ, భూముల అమ్మకం చేస్తున్నారు. కోట్ల విలువ చేసే ఎకర భూమికి రూ.10 లక్షలు చెల్లించడం దారుణం. రైతులకు పరిశ్రమలో ఉపాధి కల్పించడం, మార్కెట్‌ ఉన్న ధరను చెల్లింపులు చేయాలి. వ్యాపారం చేసే పద్ధతి మార్చాలి. 

గతంలో తీసుకున్న భూములకే న్యాయం లేదు

- కనిగిరి నర్సింహ (భూనిర్వాసితుల సంఘం ప్రధానకార్యదర్శి)

పరిశ్రమల పేరుతో భూసేకరణ చేస్తూ రైతులను రోడ్డున పడేస్తున్నారు. కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లిల్లో అప్పటి ఏపీఐఐసీ భూసేకరణ చేసి, రైతులకు న్యాయం చేయలేదు. ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామంటూ హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదు. ఇంటి స్థలం కాగితాల్లోనే ఉంది. ఇంటికో ఉద్యోగం జాడే లేకుండాపోయింది. భూసేకరణ చేసి, రైతులను విస్మరించడం దారుణమైన విషయం. భూసేకరణకు సరైన ధర చెల్లింపు చేస్తు, ఉపాధి అవకాశం కల్పించాలి. 



Updated Date - 2022-03-23T05:36:21+05:30 IST