పీహెచ్‌సీకి రూ.1.50 కోట్లతో నూతన భవనం

ABN , First Publish Date - 2022-09-30T04:32:52+05:30 IST

పుల్‌కల్‌లో రూ.1.50 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్త భవనం నిర్మించనున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజూశ్రీజైపాల్‌రెడ్డి తెలిపారు.

పీహెచ్‌సీకి రూ.1.50 కోట్లతో నూతన భవనం
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌

 జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజూశ్రీజైపాల్‌రెడ్డి


పుల్‌కల్‌, సెప్టెంబరు 29: పుల్‌కల్‌లో రూ.1.50 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్త భవనం నిర్మించనున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల మంజూశ్రీజైపాల్‌రెడ్డి తెలిపారు. పుల్‌కల్‌ ఎంపీపీ అధ్యక్షురాలు పట్లోళ్ల చైతన్యవిజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్‌ మాట్లాడారు. నూతన భవనానికి త్వరలో మంజూరు ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. వైకుంఠధామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని సర్పంచులు కోరగా... స్పందించిన జడ్పీ చైర్‌పర్సన్‌ ట్రాన్స్‌కో ఎస్‌ఈతో చర్చించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, స్థలాలను కేటాయించే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నదన్నారు. ప్రజాప్రతినిధుల సూచనల మేరకు గ్రామాల్లో ప్రభుత్వ భూములను క్రీడా ప్రాంగాణాలకు అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. మండల పరిషతు కార్యాలయ ఆవరణ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్‌, తహీసీల్దార్‌ పరమేశం, పీఆర్‌ ఏఈఈ శశికుమార్‌, ఏవో చైతన్య, ఈజీఎస్‌ ఏపీవో సంతోష్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ రుపెన్‌ చక్రవర్తి, పశువైద్యాదికారి శ్రీకాంత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ లక్ష్మీప్రసాద్‌, ట్రాన్స్‌ కో ఏఈఈ ప్రసాద్‌, ఏపీవో శివలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-09-30T04:32:52+05:30 IST