సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-14T05:17:28+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యం
‘ఉత్తమ’ అవార్డు పొందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఉపాధ్యాయులను సన్మానించిన రఘోత్తంరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రోజాశర్మ

 ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాలకులు

 ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి

 ‘ఉత్తమ’ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

వర్గల్‌, సెప్టెంబరు 13: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. వర్గల్‌లోని మండల వనరుల కేంద్రంలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రాజశేఖరశర్మతో పాటు జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 24 మందిని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేర్‌ ప్రతా్‌పరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు లేవన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నరన్నారు. 317 జీవోతో 9 శాతం ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సింగిల్‌ టీచర్ల బదిలీలను 4 శాతానికి తెచ్చామన్నారు. 13 జిల్లాలను బ్లాక్‌ లిస్టులో పెట్టడంతో భార్యభర్తల బదిలీలు నిలిచిపోయినట్లు వాపోయారు. 

అన్నం పెట్టే చదువులు కావాలి: వంటేరు

 గురుపూజోత్సవం అనేది మన సంస్కృతి, సంప్రదాయమని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష పైచిలుకు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. నేడు సమాజంలో పిల్లలకు అన్నం పెట్టే  చదువులు కావాలని, రోడ్లపై బీరు, బిర్యానీలు వద్దన్నారు. విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నారు.

పిల్లలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి: రోజాశర్మ

 అవార్డు పొందిన ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. పిల్లలకు చదువుల పట్ల తల్లి మొదటి దైవమైతే, గురువులు రెండో దైవమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు. పిల్లలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలు యాదవ్‌, ఎంపీపీ లతారమేశ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, ఎంఈవో సునీత, ఎంపీడీవో స్వర్ణకుమారి, తహసీల్దార్‌ సతీ్‌షకుమార్‌, జడ్పీహెచ్‌ఎ్‌స హెచ్‌ఎం వెంకటేశ్వర్‌గౌడ్‌, పీఆర్టీయూ మండల బాధ్యులు భాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, టీపీటీఎఫ్‌ బాధ్యులు నర్సయ్య, రాములు, యూటీఎఫ్‌ బాధ్యులు చంద్రారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.  


Updated Date - 2022-09-14T05:17:28+05:30 IST