నవరాత్రి శోభ

ABN , First Publish Date - 2022-09-26T05:55:00+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. వనదుర్గామాత తొమ్మిది రోజుల పాటు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తొలిరోజు రాజగోపురం నుంచి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుతో తీసుకువెళ్లి గోకుల్‌షెడ్‌లో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠిస్తారు.

నవరాత్రి శోభ
ఏడుపాయల గోకుల్‌షెడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపం

శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

ఏడుపాయలలో ఘనంగా ఏర్పాట్లు


పాపన్నపేట, సెప్టెంబరు 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. వనదుర్గామాత తొమ్మిది రోజుల పాటు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తొలిరోజు రాజగోపురం నుంచి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుతో తీసుకువెళ్లి గోకుల్‌షెడ్‌లో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠిస్తారు. గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారు శైలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. భక్తుల సౌకర్యార్థం పాలక మండలి, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించనున్నారు. 


చాముండేశ్వరి ఆలయంలో..

చిల్‌పచెడ్‌: చిట్కుల్‌ గ్రామ శివారులో మంజీరానది ఒడ్డున వెలసిన చాముండేశ్వరీమాత ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభవుతాయి. ఉదయం 10 గంటలకు గణపతి పూజ, అఖండ దీపారాధన, కలశస్థాపన, మూలమంత్ర పఠనం, ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. అనంతరం మహాచండి, మహావిద్య, విపరీత ప్రత్యాంగిరా, భువనేశ్వరీ మంత్ర మాలా తదితర పారాయణాలు నిర్వహిస్తారు. సాయంత్రం మహాపూజ నివేదన, హారతి, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర్‌శర్మ తెలిపారు.


ప్రధాన ఆలయాల్లో పూర్తయిన ఏర్పాట్లు

ఝరాసంగం/సంగారెడ్డి రూరల్‌/పెద్దశంకరంపేట/రామాయంపేట/రాయికోడ్‌/నారాయణఖేడ్‌: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరిలిరానున్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో గల సప్తప్రాకారయుత దుర్గా భవానీ మహాక్షేత్రం నవరాత్రులకు ముస్తాబైంది. ఆలయ ధర్మాధికారి రాధాకృష్ణమూర్తి, ప్రధానార్చకులు రవికుమార్‌శర్మ, దత్తాత్రేయశర్మ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు ఉత్సవాలు నిర్వహించనున్నారు. చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పెద్దశంకరంపేట  మండల కేంద్రంలోని రాణి శంకరమ్మ కోటను శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గడికోట విద్యుద్దీపాల అలంకరణలో మెరిసిపోతున్నది. ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించనున్నారు. రామాయంపేట పట్టణంతో పాటు మండలంలో నవరాత్రి ఉత్సవాలకు మండపాలు సిద్ధమయ్యాయి. మండల కేంద్రమైన రాయికోడ్‌లోని ముమాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు సందీ్‌పకుమార్‌జోషి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఔరంగనగర్‌ గ్రామంలో అమ్మవారి మండపాన్ని సిద్ధం చేశారు. నారాయణఖేడ్‌ మున్సిపల్‌ పరిధిలోని దుర్గాభవానీమాత ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవచండీ రుద్రహోమం నిర్వహించనున్నటు ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. అమ్మవారు మూడు రోజులు లక్ష్మీమాతగా, మూడు రోజులు సరస్వతీ మాతగా, మూడు రోజులు దుర్గామాతగా, 10వ రోజు రాజరాజేశ్వరీమాత అలంకరణలో దర్శనమిస్తారని చెప్పారు. 

Read more