ఇరుకు వీధులు..అడ్డగోలు పార్కింగ్‌లు

ABN , First Publish Date - 2022-10-09T04:39:31+05:30 IST

సిద్దిపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి ప్రజల రాకపోకలు పెరిగిపోయాయి. దానికితోడుగా షాపింగ్‌మాళ్లు, కార్పొరేట్‌స్థాయిలో ప్రైవేట్‌ ఆసుపత్రులు రావడంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇరుకు రోడ్లలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, షాపింగ్‌మాల్స్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడే పార్కింగ్‌ చేస్తుండటంతో, అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇరుకు వీధులు..అడ్డగోలు పార్కింగ్‌లు
రోడ్డుపై పార్కింగ్‌ చేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు


ప్రైవేట్‌ ఆసుపత్రుల ఎదుట రోడ్లపై యథేచ్ఛగా నిలిపివేత

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు ఆటంకాలు


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 8 : సిద్దిపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి ప్రజల రాకపోకలు పెరిగిపోయాయి. దానికితోడుగా షాపింగ్‌మాళ్లు, కార్పొరేట్‌స్థాయిలో ప్రైవేట్‌ ఆసుపత్రులు రావడంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇరుకు రోడ్లలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, షాపింగ్‌మాల్స్‌ వద్ద పార్కింగ్‌ సౌకర్యం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడే పార్కింగ్‌ చేస్తుండటంతో, అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు దారి దొరకకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై ట్రాఫిక్‌ పోలీసులు, అధికారులు అటువైపు చూడటం లేదు. 

సిద్దిపేట పట్టణానికి నిత్యం వివిధ పనుల నిమిత్తం ప్రజలు వేలాదిగా వస్తున్నారు. పట్టణంలోని మోడ్రన్‌ బస్టాండ్‌, శివాజీనగర్‌ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులు, స్కానింగ్‌ సెంటర్‌లు, షాపింగ్‌మాల్‌లు భారీగా వెలిశాయి.  పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల బిల్డింగ్‌లకు సెల్లార్‌ ఉన్నా వాటిలో పార్కింగ్‌ చేయకుండా రోడ్డుపైనే అడ్డగోలుగా పార్కింగ్‌ చేస్తున్నారు. మిగతా చోట్లా పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో రోడ్డపైనా ఇష్టానురీతిగా వాహనాలను నిలుపుతున్నారు. దీంతో ఈ ప్రైవేట్‌ ఆసుపత్రులు, షాపింగ్‌మాల్‌ల వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్లు, ఇతర ఫోర్‌ వీలర్‌ వాహనాలు ఈ మార్గాల్లో వెళ్లడానికి వీలులేకుండాపోయింది. శివాజీనగర్‌ ప్రాంతాలలో రద్దీ సమయాల్లో మరింత తలనొప్పిగా మారి, అత్యవసరంగా వెళ్లాలనుకునేవారికి తిప్పలు మాత్రం తప్పడంలేదు. మెయిన్‌ రోడ్డుపై పార్కింగ్‌ చేసిన వారికి భారీ జరిమానలు విధించే ట్రాపిక్‌ పోలీసులు జనసంచారం, వాహనా రాకపోకలు ఎక్కువగా ఉండే ఇలాంటి ప్రాంతాల్లోనూ తీసుకోవడం లేదు. ఇరుకు రోడ్లలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


చాలా ఇబ్బందులు పడుతున్నాం

సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాంగ్‌ పార్కింగ్‌తో పాటు పలు చాలాన్లను విధించే ట్రాఫిక్‌ పోలీసులు ఇటువైపు రావడం లేదు. ఈ కాలనీల్లో ఎక్కువగా ఆసుపత్రులు ఉండటంతో రోగులను తరలించే అంబులెన్స్‌ వాహనాలకు కూడా ఇబ్బందిగా మారింది. అధికారులు చర్యలు చేపట్టి సక్రమంగా వాహనాల పార్కింగ్‌ చేసేలా చూడాలి.

- ఇరుకుల అభిలాష్‌, స్థానికుడు


Updated Date - 2022-10-09T04:39:31+05:30 IST