స్వరాష్ట్రంలో ఘనంగా పండుగలు

ABN , First Publish Date - 2022-10-02T05:42:32+05:30 IST

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని, అందుకే పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలంలోని బల్కంచెల్కా (భక్తిధాం) తండాలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు.

స్వరాష్ట్రంలో ఘనంగా పండుగలు
బతుకమ్మ పేర్చుతున్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   

బల్కంచెల్కా తండాలో బతుకమ్మ సంబురాలకు హాజరు


కల్హేర్‌, అక్టోబరు 1: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని, అందుకే పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలంలోని బల్కంచెల్కా (భక్తిధాం) తండాలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. తొలుత విశ్వపాలిని భవానీమాత, సంత్‌ సేవాలాల్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, రామచంద్రపురం కార్పొరేటర్‌ పుష్పాయాదవ్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీ, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ సతీమణి పద్మావతితో కలిసి బతుకమ్మను పేర్చారు. గిరిజన మహిళలతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకుల హయాంలో తెలంగాణ సంప్రదాయాలు, పండుగలను నిర్లక్ష్యం చేశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో మన పండుగల విశిష్టత ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడుపుతున్నారని, మన పండగలను మరింత గొప్పగా జరుపుకుంటున్నామని తెలిపారు. గిరిజనులకు, వారి సంప్రదాయాలకు కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యమిస్తారని చెప్పారు. అందుకే వారికి 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించారని తెలియజేశారు. బల్కంచెల్కా సర్పంచ్‌ మూడ్‌ లలితాకిషన్‌, మేడ్చల్‌ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్‌ మూడ్‌ కిషన్‌సింగ్‌లను ఎమ్మెల్సీ అభినందించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌, ఎంపీటీసీ కిషన్‌ నాయక్‌, ఎంపీపీలు సుశీల, మహిపాల్‌రెడ్డి, జయశ్రీరెడ్డి, జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, వైస్‌ ఎంపీపీలు నారాయణరెడ్డి, ప్రయాగబాయి మాధవరావుపాటిల్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు రవీందర్‌నాయక్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీఅలీ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రమణకుమార్‌ బందోబస్తును పర్యవేక్షించారు. తండాలో బతుకమ్మ ఉత్సవాలకు వీఆర్‌ఏలు హాజరుకాగా ముందస్తుగా అరెస్టు చేశారు.

వనదుర్గామాతకు బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత 

పాపన్నపేట, అక్టోబరు 1: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గామాతకు బంగారు బోనాన్ని సమర్పించారు. నవరాత్రుల్లో అమ్మవారికి 108 బోనాలను సమర్పించడం ఆనవాయితీ. కాగా శనివారం నిర్వహించిన ఈ కార్యమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో సార శ్రీనివాస్‌ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక మండపంలో కాత్యాయనీ అలంకరణలో కొలువుదీరిన అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల ఊరేగింపులో మహిళలతో కలిసి కవిత బోనం ఎత్తుకున్నారు. గర్భగుడిలో అమ్మవారికి బంగారు బోనాన్ని, పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రంలో కాటేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ లావణ్యారెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు మల్లిక, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జగన్‌, స్థానిక సర్పంచ్‌ సంజీవరెడ్డి, మాజీ జడ్పీటీసీ స్వప్న తదితరులు పాల్గొన్నారు. 

Read more