తెలంగాణ వ్యతిరేకుల పిల్లలు సేవ చేస్తరట

ABN , First Publish Date - 2022-10-03T05:40:05+05:30 IST

తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన, రాష్ట్రం రాకుండా అడ్డుకునేందుకు యత్నించిన నాయకుల పిల్లలు నేడు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తామని బయలుదేరడం సిగ్గుచేటని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

తెలంగాణ వ్యతిరేకుల పిల్లలు సేవ చేస్తరట
థీమ్‌ పార్కును ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యే, తదితరులు

ప్రజలు వారిని విశ్వసించరు

పటాన్‌చెరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

కాలుష్యాన్ని రూపుమాపి అభివృద్ధి చేస్తున్నాం : ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు


పటాన్‌చెరు, అక్టోబరు 2: తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన, రాష్ట్రం రాకుండా అడ్డుకునేందుకు యత్నించిన  నాయకుల పిల్లలు నేడు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తామని బయలుదేరడం సిగ్గుచేటని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన పటాన్‌చెరులో రూ.5.10 కోట్లతో చేపట్టిన ట్రాయాంగిల్‌ ఽథీమ్‌పార్కు, వ్యాయామశాల, జేపీ లయన్స్‌ క్లబ్‌ భవనాలను ప్రారంభించారు. కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిపై టీఆర్‌ఎ్‌సకు ఉన్న చిత్తశుద్ధి మరో పార్టీకి లేదని స్పష్టం చేశారు. గాంధీజీ స్ఫూర్తితో ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రం సాధించిన కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇతర ప్రాంతాల నాయకులకు ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన నాయకుల పిల్లలే నేడు ఉద్ధరిస్తామని తిరగడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ ఇవ్వడం అంటే బీడీ, సిగరెట్‌ కాదని ఎద్దేవా చేసిన నాయకుల మాటలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని పేర్కొన్నారు. అటువంటి వారిని ప్రజలు విశ్వసించబోరని తెలిపారు. ప్రజల్లోకి వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాతం రూపురేఖలను సమూలంగా మార్చామని పేర్కొన్నారు.  ఒకప్పుడు కాలుష్యంతో సతమతమైన ప్రాంతం నేడు నేడు అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుస్తున్నదని వివరించారు. నియోజకవర్గంలో మెడికల్‌ డివైజ్‌పార్కు, ఎల్‌ఈడీపార్కు, ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని వివరించారు. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌ రింగురోడ్డు అవతలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే పటాన్‌చెరులో సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభిస్తామని తెలియజేశారు. వంద పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని వివరించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కృషితో పటాన్‌చెరు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నదని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌, మాజీ జడ్పీటీసీ జైపాల్‌, కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌ దేవేందర్‌రాజు, యువజన నాయకులు పృథ్వీరాజ్‌, గూడెం మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read more